భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వైయస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల పర్యటించారు. పినపాక నియోజకవర్గం రావిగూడెం గ్రామంలో వరద బాధితులను పరామర్శించారు. గోదావరి వరదలతో మునిగిపోయిన ఇళ్లను షర్మిల పరిశీలించారు. ఈ సందర్భంగా వరద బాధితులకు నష్టపరిహారం ఇస్తామని హామీ ఇవ్వడం..మరిచిపోవడమే కేసీఅర్ కు తెలుసన్నారు షర్మిల. గతంలో వరంగల్, ఖమ్మం రైతులను ఇలానే మోసం చేశారని గుర్తుచేశారు.
వరదలతో ప్రజలు సర్వం కోల్పోతే.. వారికి తక్షణ సాయం చేయలేని సీఎం ఎందకు ఉన్నారంటూ షర్మిల మండిపడ్డారు. పరిపాలన చేతకాక పోతే రాజీనామా చేసి దలితున్ని ముఖ్యమంత్రి చేయండి అంటూ ఎద్దేవా చేశారు.
వరదల కారణంగా గతంలో లక్షల మంది జీవితాలు ఆగం అయ్యాయి అని గుర్తు చేస్తూ…నష్ట పరిహారం అందిస్తామని చెప్పిన 10 వేల సహాయం కూడా ఇంకా అందలేదని తెలిపారు. 10 వేలు సరిపోవు అంటూ 25 వేలు సహాయం అందించాలని కోరారు.
బాధితులకు సహాయం చేస్తామని చెప్పి పనికిరాని బియ్యం ఇచ్చారని బాధితులు చెప్తున్నారని.. ఇచ్చిన ఒక్క హామీ కూడా నిలబెట్టుకోక పోతే సీఎంగా బాధ్యతలు ఎందుకు నిర్వర్తిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల. పంట నష్టపోయిన రైతులకు కూడా వెంటనే పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.