హన్మకొండ పెట్రోల్ పంప్ వద్ద వైఎస్సార్ తెలంగాణ పార్టీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. వరంగల్ నగరంపై కేసీఆర్ కి ప్రేమ లేదన్నారు. ఇక్కడకు వచ్చిన ప్రతి సారి ఎన్నో పిట్ట కథలు చెప్పి పోతుంటారని ఎద్దేవా చేశారు. వరంగల్ కార్పొరేషన్ కు స్థానిక ఆదాయంతో సంబంధం లేకుండా ప్రతి ఏటా అదనంగా రాష్ట్ర ప్రభుత్వం రూ.300 కోట్లు ఇస్తా అని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇప్పటివరకూ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. వరంగల్ నగరాన్ని డల్లాస్ చేస్తా అని చెప్పారు? హైదరాబాద్ తర్వాత వరంగల్ ను IT హబ్ చేస్తా అని హామీ ఇచ్చారు? అయ్యాయా? అని ప్రశ్నించారు.
IT కంపెనీలు వచ్చింది లేదు.. ఉద్యోగాలు ఇచ్చింది లేదన్నారు. నిరుపయోగంగా ఉన్న మామునూరు ఎయిర్ పోర్టులో విమానాలు దింపుతా అన్నాడు. అక్కడ విమానాలు దింపింది లేదు.. రన్వే మీద గడ్డి మొలిచినా పీకే వాడు లేడంటూ సెటైర్లు వేశారు. విమానాలు దిగే వరకు హెలికాఫ్టర్లు దింపుతా అన్నాడు.. దింపాడా? వరంగల్ కు పెద్ద పెద్ద పరిశ్రమలు, ఇండస్ట్రీయల్ కారిడార్ తెస్తా అన్నారు.. ఆ హామీ ఏమైంది? అంటూ నిలదీశారు షర్మిల.
టెక్సైల్ పార్క్ కోసం భూములు ఇవ్వమని మందు డబ్బాలు పట్టుకొని ఆందోళన చేస్తున్నా.. మీ ఎమ్మెల్యేలు రౌడీ ఇజం చేసి గుంజుకుంటున్నారని ఆరోపించారు. వరంగల్ కు మెట్రో రైల్ అన్నాడు.. ఎక్కడ ఉంది మెట్రో రైల్? అని ప్రశ్నించారు. ఇక్కడ జర్నలిస్టుల కాలని చూసి రాష్ట్రంలో మిగతా జర్నలిస్టులు కుల్లుకునేలా ఉండాలని చెప్పారు. అరచేతిలో స్వర్గం చూపించాడు.. ఒక్క జర్నలిస్ట్ కు కూడా ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదన్నారు. జర్నలిస్ట్ లను మోసం చేసిన ఘనత కేసీఆర్ ది అంటూ విమర్శించారు.
ఇదే వరంగల్ జిల్లాకు వైఎస్సార్ హయాంలో ఎంతో న్యాయం జరిగిందన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తానికి వ్యవసాయానికి సాగునీరు అందించే లక్ష్యంగా దేవాదుల ప్రాజెక్ట్ కట్టారని గుర్తు చేశారు. వైఎస్సార్ మరణం తర్వాత ఈ ప్రాజెక్ట్ ఇంకా పూర్తి చేయలేదన్నారు. 70 శాతం వైఎస్సార్ పూర్తి చేసినా.. మిగిలిన 30 శాతం పనులు కేసీఆర్ పూర్తి చేయలేక పోయారని దుయ్యబట్టారు. బంగారు తెలంగాణలో బాగుపడింది కేసీఆర్ కుటుంబం మాత్రమే అన్నారు. కేసీఆర్ ఇంట్లో 5 ఉద్యోగాలు ఉంటే.. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక వందల మంది నిరుద్యోగులు చనిపోయారన్నారు.
9 ఏళ్లలో కేసీఆర్ ఇచ్చిన ఒక్క పథకం కూడా అమలు కాలేదన్నారు. పథకాల పేరు చెప్పి కేసీఆర్ చేసింది మోసమని.. అందుకే కేసీఆర్ మోసగాడు అంటూ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీని బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ చేశారన్నారు. అందుకే కేసీఆర్ పాలన పోవాలి.. వైఎస్సార్ సంక్షేమ పాలన రావాలన్నారు. వైఎస్సార్ సంక్షేమ పాలనను మళ్ళీ తిరిగి తీసుకు వస్తామంటూ పేర్కొన్నారు వైఎస్ షర్మిల.