కేంద్రంపై టీఆర్ఎస్ చేస్తోన్న ధర్నాలు, రాస్తారోకోలు అంతా డ్రామా అని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఖమ్మం జిల్లా ముత్తగూడెం రైతు ధర్నాలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ ప్రజల నెత్తిన కేసీఆర్ నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పుచేసి పెట్టాడని ఆరోపించారు.
రైతులు నిరసన తెలపక పోతే రైతుబంధు కట్ చేస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ చేసిన వ్యాఖ్యలను ఆమె ఖండించారు. మంత్రి ఏమైనా తన ఇంట్లో డబ్బులు ఇస్తున్నాడా అని నిలదీశారు. తమ పార్టీ అధికారంలో వస్తే.. రైతు రుణమాఫీ, సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పావలా వడ్డీకే రుణాలు, నష్టపరిహారం ఇస్తామని.. ఆరోగ్యశ్రీ పథకం పూర్తిస్థాయిలో అమలయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు షర్మిల.
కేసీఆర్.. సంతకం పెట్టి మళ్లీ కేంద్రంపై ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కేసీఆర్ కు ఏమైనా సోయి ఉంటే.. ప్రతి సంవత్సరం కొన్నట్టుగానే ఈ ఏడాది కూడా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రంలో, రాష్ట్రంలో పాలకులు ఎలా ఉన్నారో ఒక సారి ప్రజలే ఆలోచన చేయాలని షర్మిల సూచించారు. ప్రతీ వస్తువుపై ధరలు పెరుగడానికి బీజేపీ కారణం కాదా అని నిలదీశారు. కేంద్రంతో పోటీపడి.. కేసీఆర్ అన్నింటికీ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారని ఆరోపించారు షర్మిల.