బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కడియం శ్రీహరికి వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమాన్ని అడ్డుపెట్టుకొని పదవులు అనుభవించిన కడియమే అసలైన తెలంగాణ ద్రోహి అని ఆమె తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు.
మంత్రిగా పనిచేసి కూడా నియోజకవర్గానికి కడియం శ్రీహరి ఒక్క డిగ్రీ కాలేజీ తీసుకురాలేదని ఆమె విమర్శలు గుప్పించారు. స్టేషన్ ఘనపూర్‌కు చెందిన ఇద్దరు రాజయ్యలు అధికార పార్టీలో ఉండి ఏ లాభమని ఆమె ప్రశ్నించారు.
ఉప ముఖ్యమంత్రులుగా పని చేసి స్టేషన్ ఘన్ పూర్ కు వాళ్లు చేసింది సున్నా అని విమర్శలు గుప్పించారు. ప్రెస్ మీట్లు పెట్టుకుని వారిద్దరూ ఒకరినొకరు తిట్టుకోవడం తప్ప వాళ్లకు ప్రజాసమస్యలపై సోయి ఉందా అని మండిపడ్డారు.
దళిత నేతలై ఉండి కూడా దళితులకు అన్యాయం జరిగితే నోరు విప్పరా అంటూ ఆమె ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ వెన్నుపోటు పొడిస్తే.. తాను మాత్రం ఈ గడ్డకు సేవ చేసేందుకే పార్టీ పెట్టానన్నారు. రాష్ట్రాన్ని బంగారు పళ్లెంలో పెట్టి అప్పగిస్తే దాన్ని సీఎం అప్పుల కుప్పగా మార్చారని ఆమె ఆరోపించారు. కమిషన్ల రూపంలో రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టిన దొంగ కేసీఆర్ అని ఆరోపణలు గుప్పించారు.
షర్మిలపై నిన్న బీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మొదటి నుంచి వైఎస్సాఆర్ కుటుంబం తెలంగాణకు వ్యతిరేకమన్నారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో తెలంగాణ ఏర్పాటుకు అడుగడుగునా అడ్డుతగిలారన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసైన రోజున వైఎస్ జగన్ సమైక్యాంధ్ర ప్లకార్డులను పట్టుకున్నారన్నారు.
అప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుతగిలి, ఇప్పుడు మళ్లీ తెలంగాణలోనే రాజకీయాలు చేస్తామంటే చూస్తూ ఉండడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని ఆయన ధ్వజమెత్తారు. షర్మిల ఏమైనా రాజకీయ పరిజ్ఞానం ఉంటే ఏపీకి వెళ్లాలంటూ ఆయన సూచించారు.