వైఎస్ షర్మిల, వైటీపీ అధ్యక్షురాలు
నిత్యావసర ధరలు, ఇంధన రేట్లు, పన్నులు పెరిగి ప్రజలు గోసపడుతుంటే.. పెన్షన్లు, ఫీజు రీయింబర్స్ మెంట్, వడ్డీలేని రుణాలు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఆరోగ్యశ్రీ అందక జనం గగ్గోలు పెడుతుంటే.. పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు, ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు రాజకీయాలు చేస్తున్నాయి. జనం మధ్యలో ఉండి నిరంతరాయంగా పోరాడుతూ, ప్రభుత్వాలను ప్రశ్నిస్తూ.. ప్రజలకు భరోసా కల్పిస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమే.
రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ దొరల పాలనకు, మోడీ దొడ్డిదారి పాలనకు ప్రజలు చరమగీతం పాడాలి. ప్రజలకు మంచి చేసే వైఎస్సార్ సంక్షేమ పాలనకు నాంది పలకాలి. ప్రజాప్రస్థానం పాదయాత్రకు తరలివచ్చి నన్ను ఆశీర్వదించిన హుజుర్ నగర్ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతోవైఎస్సాఆర్ ఆరోగ్యశ్రీని ప్రారంభిస్తే… ఆ పథకాన్ని కేసీఆర్ నిర్లక్ష్యం చేస్తున్నారు.
సైదిరెడ్డి లాంటి కక్కుర్తి ఎమ్మెల్యేను ఎక్కడా చూడలేదు. మట్టి, ఇసుక, రేషన్ బియ్యం మొదలు డ్రైనేజీ పైపుల వరకు అన్ని దందాలు చేస్తూ దోచుకుంటున్నాడు. టీఆర్ఎస్ లో నేతలెలా ఉన్నారో క్యాడర్ కూడా అలాగే ఉంది. హైదరాబాద్ కు వచ్చిన మోడీని కేసీఆర్ రాష్ట్ర సమస్యలపై ఎందుకు నిలదీయలేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ట్రైబల్ యూనివర్సిటీ, ధాన్యం కొనుగోలు, పసుపు బోర్డు వంటి హామీల గురించి ఎందుకు మాట్లాడలేదు.
ప్లెక్సీల పేరుతో బీజేపీ, టీఆర్ఎస్ డ్రామాలాడాయి. యాడ్స్ పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం వృధా అయింది. ఓటుకు నోటు కేసులో స్పష్టమైన ఆధారాలున్నా రేవంత్ రెడ్డిని ఎందుకు జైల్లో వేయలేదు. తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మను ఓడిపోయే స్థానంలో టికెట్ ఇచ్చారు. నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయిన తన కూతురు కల్వకుంట్ల కవితకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కేసీఆర్. శంకరమ్మపై ఎందుకు వివక్ష.