తెలంగాణలో పోలీసులు కండువా వేయని టీఆర్ఎస్ కార్యకర్తలని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. వైస్సార్టీపీ అధినేత వైఎస్ షర్మిల చేపట్టిన పాదయాత్ర 67వ రోజుకు చేరుకుంది. మంగళవారం పినపాక నియోజక వర్గం సారపాక క్యాంప్ నుంచి పాదయాత్రను మొదలుపెట్టారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై షర్మిల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
భద్రాచలంలో మీటింగ్ పెడితే రూల్స్ అతిక్రమించామని కేసులు పెట్టారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. మేము ఏం తప్పు చేశాం.. ఏం రూల్స్ అతిక్రమించామో చెప్పాలని నిలదీశారు. పాదయాత్ర చేస్తున్నందుకు తమ మీద కేసులు పెడతారా అని షర్మిల ప్రశ్నించారు.
ప్రజల పక్షాన నిలబడి సమస్యలు ఎత్తి చూపుతున్నందుకు కేసులు పెడతారా అని ఆగ్రహ వ్యక్తం చేశారు. కేసులు పెట్టాల్సింది కేసీఆర్ మీద అని, ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు, పోడు భూములకు పట్టాలు ఇవ్వనందుకు కేసీఆర్‌పై కేసులు పెట్టాలని ధ్వజమెత్తారు.
కేసీఆర్‌ను జైల్లో పెట్టి.. లాఠీలతో కొట్టాలని విమర్శించారు. లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిశ్వాల్ కమీటీ చెప్తోందని, కొత్త జిల్లాలు, కొత్త మండలాలలో ఖాళీలను కలుపుకుంటే 3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలని తెలిపారు. తెలంగాణలో ఖాళీగా ఉద్యోగాలకు పూర్తి స్థాయిలో నోటిఫికేషన్లు ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.