తెలంగాణ రాష్ట్రానికి మొట్ట మొదటి మహిళా సీఎం అవుతానని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల సంచలన ప్రకటన చేశారు. కోదాడ నియోజకవర్గంలో 101వ రోజు కొనసాగుతున్న ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
రాష్ట్రంలో వైఎస్సార్ సంక్షేమ పాలన కరువయిందన్నారు షర్మిల. తన తండ్రికోరుకున్న రాజ్యం తీసుకురావడానికే తెలంగాణలో పార్టీ పెట్టానన్నారు షర్మిల. వైఎస్సార్ సంక్షేమ పాలన తీసుకురావడమే తమ లక్ష్యమన్నారు షర్మిల.
వైఎస్సార్ హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుభిక్షంగా ఉందని గుర్తు చేశారు. కులాలకు మతాలకు అతీతంగా అన్ని వర్గాలను వైఎస్సార్ ఆదుకున్నారని పేర్కొన్నారు. వైఎస్సార్ సీఎం గా ఉన్నప్పుడు ఏ పథకం తీసుకొచ్చినా అద్భుతంగా చేసి చూపించారన్నారు. 8 ఏళ్లుగా కేసీఆర్ సీఎంగా ఉంటూ ప్రతీ వర్గాన్ని మోసం చేశారని వెల్లడించారు.
డబుల్ బెడ్ రూం అని మోసం.. మూడు ఎకరాల భూమి అని మోసం.. ఇలా ప్రతీ వర్గాన్ని మోసం చేశారని ఆరోపించారు షర్మిల. ప్రతీ పేద కుటుంబానికి మహిళ పేరు మీద పక్కా ఇల్లు అని చెప్పి ప్రజలను మోసం చేశారని విరుచుకుపడ్డారు. రాష్ట్రంలోని వృద్దులు.. వికలాంగులకు 3 వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి మోసం చేశారని ఆరోపించారు షర్మిల.