తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు. రాష్ట్రంలో సమస్యలు లేవని నిరూపిస్తే.. ముక్కు నేలకేసి రాసి ఇంటికెళ్తానన్నారు. అదే సమస్యలు ఉన్నాయని తేలితే ముఖ్యమంత్రి రాజీనామా చేసి క్షమాపణలు చెప్పి.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని పేర్కొన్నారు వైఎస్ షర్మిల. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా మంగళవారం మెదక్ నియోజక వర్గం దుబ్బాక నియోజకవర్గం చేగుంటలో ప్రసంగించారు పాల్గొన్నారు వైఎస్ షర్మిల. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేసీఆర్ పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
దుబ్బాక ప్రజలకు కేసీఆర్ చెవిలో పూలు పెడితే.. రఘునందన్ క్యాలీ ఫ్లవర్ పెట్టారని ఎద్దేవా చేశారు. మంజీరా నీళ్లతో దుబ్బాకలో తాగునీటి కష్టాలు తీరవనన్నారు. నియోజకవర్గంలో డిగ్రీకాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీలు, ఐటీఐ కాలేజీలు, గురుకులాలు, మోడల్ స్కూల్స్, ఇలా అన్ని వైఎస్సార్ ఇచ్చినవే అని గుర్తు చేశారు షర్మిల. దుబ్బాకలో ఆరు సంవత్సరాలుగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే పరిపాలించారు. ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే రెండేళ్లుగా ఉన్నారు. ఆరేళ్లుగా కేసీఆర్ దుబ్బాక ప్రజలకు చెవిలో పూలు పెడితే.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఏకంగా చెవిలో క్యాలీఫ్లవర్ పెట్టాడని షర్మిల సెటైర్లు విసిరారు.
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ పై కూడా వైఎస్ షర్మిల ఆరోపణలు చేశారు. రఘునందన్ బీజేపీ కండువా కప్పుకున్న టీఆర్ఎస్ నాయకుడన్నారు. మల్లన్న సాగర్ బాధితులకు రఘునందన్ ఇచ్చిన హామీ నెరవేర్చారా అని ఆమె ప్రశ్నించారు. 11 గ్రామాల ప్రజలకు అన్యాయం జరిగిందని నేను న్యాయం చేస్తానని రఘునందన్ రావు చెప్పి రెండింతలు పరిహారం ఇప్పిస్తానని పరిహారం ఇప్పించక పోతే రాజీనామా చేస్తానని అన్నారు. కానీ ఇప్పటికీ ఆ పరిహారం ఇప్పించనూ లేదు.. ఆయన రాజీనామా చేయలేదన్నారు. రఘునందన్ ఉండేది బీజేపీలోనా.. టీఆర్ఎస్ లోనా అని ఆమె ప్రశ్నించారు.
ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గురించి ఆయన అవినీతి గురించి మాట్లాడితే నా మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారని షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. దళితులను ముఖ్యమంత్రి చేస్తా.. వారికి మూడు ఎకరాలు భూమి ఇస్తానన్న మాట ఇచ్చిన వారిపై కేసులు పెట్టే ధైర్యం వీరికి ఉందా అని నిలదీశారు షర్మిల. మేము ఆయన మీద కేసులు పెడితే తీసుకోరు. మీ కేసులకు నేనుభయపడదన్నారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.