టీపీసీపీ చీఫ్ రేవంత్ రెడ్డి పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నాది ఆంధ్రా అయితే.. మరి సోనియా గాంధీ ఎక్కడ? ఆమెది ఇటలీ కదా అని ప్రశ్నించారు. తన వల్ల రేవంత్ రెడ్డి ఉనికి ఎక్కడ పోతుందో అని భయంగా ఉందని, అందుకే ఇలా మాట్లాడుతున్నారని షర్మిల దుయ్యబట్టారు.
రేవంత్ రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్న ఏకైక పార్టీ వైఎస్సార్టీపీ అని అన్నారు. జై తెలంగాణ అనే హక్కు రేవంత్ రెడ్డి, కేసీఆర్, మోదీ, సోనియాలకు లేదన్నారు. రేవంత్ రెడ్డి అల్లుడు కూడా ఆంధ్రా అని.. ముందు ఆ సంగతి ఏంటో రేవంత్ రెడ్డి చూడాలని షర్మిల వ్యాఖ్యానించారు.
ఒక ప్రాంతాన్ని వదిలేసి.. సొంత వాళ్ళను కాదనుకొని… ఒక మహిళ పెళ్లి చేసుకున్నందుకు .. బిడ్డలను కనీ తనని తానే అంకితం చేస్తుంది మహిళ అని అన్నారు. ఇది మన దేశ సంస్కృతి, గొప్పతనమని, ఇంత గొప్ప సంస్కృతిని అర్థం చేసుకోవాలనుకుంటే సంస్కారం ఉండాలని, ఇంతటి సంస్కారం రేవంత్ రెడ్డికి లేదన్నారు.
దళితబంధు పథకంలో ఎమ్మెల్యేల అవినీతిని ప్రశ్నిస్తే ప్రగతి భవన్ లోని కమీషన్ల డొంక కదులుతుందనే భయంతోనే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై యాక్షన్ తీసుకోవడం లేదని ఆరోపించారు. దళిత బంధులో సొంత పార్టీ ఎమ్మెల్యేలే స్వాహా చేశారని స్వయంగా కేసీఆర్ అంగీకరించరాని ఆరోపించారు వైఎస్ షర్మిల.