కేసీఆర్ సర్కార్‌పై వైటీపీ అధ్యక్షురాలు షర్మిలా ఫైర్ అయ్యారు. తహసిల్దార్ వద్ద పరిష్కారమయ్యే సమస్యను ధరణి తీసుకు వచ్చి రైతులు కలెక్టర్ వద్దకు వెళ్లేలా కేసీఆర్ ప్రభుత్వం చేసిందన్నారు. ధరణి పేరిట రికార్డ్లను తారుమారు చేసి రైతుల ఉసురు తీస్తున్నారని ఆమె తీవ్రంగా మండిపడ్డారు.
రైతు బంధు రూ. 5వేలు ఇస్తే రైతులు కోటీశ్వరులు ఎలా అవుతారని ఆమె ప్రశ్నించారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో చేసిన ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 8వేల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు. కానీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదన్నారు.
పెన్షన్ అని చెబుతూ ఇంట్లో కేవలం ఒకరికి మాత్రమే ఇవ్వడం న్యాయమా అంటూ ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో 13లక్షల మంది పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారని అన్నారు. రేషన్ షాపుల్లో అన్నింటిని బందు పెట్టి కేవలం దొడ్డు బియ్యం ఇస్తున్నారని ఆరోపించారు.
రాబోయే ఎన్నికల్లో కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎరువులు, విత్తనాలకు సబ్సిడీ, ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టం జరిగితే కూడా సబ్సిడీ ఇచ్చేవారన్నారు. అంటే రూ.30వేల వరకు పథకాలను రైతులకు ఇచ్చేవారన్నారు.