– కేసీఆర్ అవినీతి దాహానికి కాళేశ్వరం సజీవ సాక్ష్యం
– అన్ని ప్రాజెక్టులు మేఘాకే ఎలా ఇస్తారు?
– ఏటీఎంలా మారిందని విమర్శలేనా? చర్యలెప్పుడు?
– మేఘా అవినీతిపై రేవంత్, బండి ఎందుకు స్పందించరు?
– ముడుపులు ఏమైనా అందాయా?
– కేసీఆర్, కృష్ణారెడ్డి అక్రమాల చిట్టా బయటపడాల్సిందే!
– సీబీఐతో విచారణ జరగాల్సిందే!
– ఢిల్లీలో షర్మిల సంచలన ప్రెస్ మీట్
కాళేశ్వరం ప్రాజెక్ట్ కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, గజేంద్ర షెకావత్ విమర్శించారు.. మరి, ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీశారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. ఢిల్లీలో సీబీఐ అధికారులను కలిసిన ఆమె.. తెలంగాణలో ప్రాజెక్టుల పేరుతో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేశారు. వెంటనే విచారణ జరిపించాలని వినతిపత్రం అందించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల వరకు మూఘా కంపెనీతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె.. కేసీఆర్, మేఘా కృష్ణారెడ్డిపై విరుచుకుపడ్డారు.
కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, మిషన్ భగీరథ్ ప్రాజెక్టుల్లో భారీ అక్రమాలు జరిగినా కాంట్రాక్టర్లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని షర్మిల ప్రశ్నించారు. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డితో పాటు మూడు ప్రధాన ప్రాజెక్టులను ఒకే కంపెనీకి కేటాయించారని అలా ఎలా ఇస్తారని నిలదీశారు. కేసీఆర్ అవినీతి దాహానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ సజీవ సాక్ష్యమని ఆరోపించారు. ప్రాజెక్ట్ నిర్మాణంలో కేసీఆర్ పెద్దఎత్తున అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం రూ.38 వేల కోట్లు ఉండగా… కేసీఆర్ సీఎం అయ్యాక రూ.లక్షా 20 వేల కోట్లకు చేరుకుందని వివరించారు.
చిన్న పని మొదలుకొని కాళేశ్వరం ప్రాజెక్ట్, మిషన్ భగీరథ పథకం వరకు ప్రతి కాంట్రాక్ట్ ను మేఘా సంస్థకే అప్పజెప్పడం వెనుక మతలబు ఏంటని ప్రశ్నించారు షర్మిల. కేసీఆర్ కు మేఘా సంస్థకు మధ్య అవినీతి ఒప్పందం ఉందని ఆరోపించారు. మేఘా సంస్థకు టెండర్లు అప్పగించే క్రమంలో నియమ, నిబంధనలను తుంగలో తొక్కారని ఫైరయ్యారు. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంపై ఏమాత్రం నోరు మెదపడం లేదని, బహుశా మేఘా సంస్థ నుంచి వాళ్లకు కూడా ముడుపులు ముట్టాయా? అని నిలదీశారు.
కేసీఆర్ ముందుచూపు లోపం, అసమర్థత వల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ దేనికీ పనికి రాకుండా పోయిందని అన్నారు షర్మిల. కాళేశ్వరం నిర్మాణ వ్యయం అంతకంతకూ పెరుగుతోందని.. ఒకప్పుడు స్కూటర్ లేని కేసీఆర్ కు ఇవాళ సొంతంగా విమానం కొనుక్కునేంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలని నిలదీశారు. డీఐజీ లెవల్ అధికారితో కేసీఆర్ అవినీతిపై విచారణ జరిపించాలని సీబీఐని కోరినట్లు చెప్పారు. బీఆర్ఎస్ అంటూ మరో డ్రామాకు తెర తీశారని, దానివల్ల దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. కేసీఆర్ కు సీఎంగా కొనసాగే అర్హత లేదన్న షర్మిల… తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్, మేఘా సంస్థ అక్రమాలను బీజేపీ ఊపేక్షించడానికి కారణమేంటని ప్రశ్నించారు. నిత్యం విమర్శించే బీజేపీ నేతలు కేసీఆర్ మీద ఎందుకు చర్యలు తీసుకోరని కడిగిపారేశారు. ఏ కారణం చేత వెనకాడుతున్నారో బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలన్నారు. కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని నిరూపించుకోవాలని చెప్పారు. అవినీతి ఇదే మాదిరి కొనసాగితే రాష్ట్రం అదోగతి పాలవుతుందని.. ఎనిమిదేళ్లలో 4 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారని మండిపడ్డారు.
తెలంగాణలో వైఎస్సార్ పాలనను తిరిగి తీసుకురావడం కోసమే పార్టీ పెట్టినట్లు చెప్పారు షర్మిల. ఆంధ్రాలో జరిగే వ్యవహారాలతో తనకు సంబంధం లేదని, అక్కడ అక్రమాలు జరిగితే అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలు సీబీఐకి ఫిర్యాదు చేయాలన్నారు. బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ వంటి పార్టీలతో కలిసి పోటీ చేసే ఆలోచన తనకు లేదని.. తన బాల్యం మొత్తం తెలంగాణలో సాగిందని, చదువు, పెళ్లి, జీవితం మొత్తం ఇకక్కడేనని వివరించారు. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తన జీవితం మొత్తం తెలంగాణతోనే ముడిపడి ఉందన్నారు. తెలంగాణలో ఏ పార్టీతో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని ఒంటరిగానే పోటీ చేయనున్నట్లు క్లారిటీ ఇచ్చారు.
ఇక మునుగోడు ఉప ఎన్నికపై స్పందిస్తూ.. ఈ ఎలక్షన్ ఎమ్మెల్యే చనిపోతే రాలేదన్నారు. బీజేపీ అధికారంలోకి రావాలనే తాపత్రయంతో చేసిందని.. అలాగే టీఆర్ఎస్ అధికార మదంతో తమ అధికారాన్ని నిలబెట్టుకోడానికి ఆ రాజీనామాను అమోదించి ఎన్నికను తీసుకొచ్చిందని విమర్శించారు. వీధిలో కుక్కల పొట్లాట మాదిరి జరుగుతున్న ఎన్నికగా మునుగోడు బైపోల్ ను అభివర్ణించారు షర్మిల. మునుగోడు ఎన్నిక ఎలా రెఫరెండం అవుతుందని ప్రశ్నించారు. కేసీఆర్ పాలన దరిద్రంగా ఉందని, ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికకు వెళ్తే అది రెఫరెండం అవుతుందని తెలిపారు.