తెలంగాణ కోడలిగా, వైఎస్ కూతురిగా తెలంగాణలో రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు వైఎస్ షర్మిల ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణలో వైఎస్ పెట్టిన సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కావటం లేదని, 2023లో అధికారమే ధ్యేయంగా పనిచేయాలని షర్మిల పిలుపునిచ్చారు.
ఏప్రిల్ 9న ఖమ్మం జిల్లాలో జరిగే బహిరంగ సభ నుండి పార్టీ పేరు, విధివిధానాలు ప్రకటించబోతున్నారు. ఇప్పటికే ఈ సభకు పోలీసులు కూడా అనుమతిచ్చిన నేపథ్యంలో… తెలంగాణలోని అన్ని జిల్లాల్లో తనతో టచ్ లో ఉన్న ముఖ్యనేతలందరితో షర్మిల లోటస్ పాండ్ లో భేటీ అయ్యారు.
టీఆర్ఎస్, బీజేపీలు పిలిస్తే తాను రాలేదని… మనం ఎవరికీ భీ టీం కాదన్నారు. 2023 ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామని… ఏ పార్టీతోనూ పొత్తులుండవని ఆమె వ్యాఖ్యానించారు. వైఎస్ పేరు, ఫోటోతోనే ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్దామని ప్రకటించినట్లు తెలుస్తోంది.
అయితే, పార్టీ పేరుపై పలు ప్రచారాలు జరుగుతుండగా… వైఎస్సార్ తెలంగాణ అనే పేరు వైపు షర్మిల మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.