వైఎస్ షర్మిల కొత్త పార్టీ ఏర్పాటుకు సిద్ధమవుతుండటం..తెలంగాణలోని YCP నేతలని ఆయోమయంలో పడేస్తోంది. వైసీపీ తరపున కొనసాగాలా.. లేక షర్మిల వెంట వెళ్లాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. భవిష్యత్తులో తెలంగాణలో వైసీపీ కొనసాగింపుపై పార్టీ అధిష్టానం స్పష్టమైన అభిప్రాయం చెప్పకపోవడంతో ఏమనుకుంటున్నారో డైలమాలో పడ్డారు.
2014 ఎన్నికల్లో తెలంగాణలో వైసీపీ 6 శాతం ఓట్లు సంపాదించింది. ఖమ్మం జిల్లాలో ఒక ఎంపీ.. ముగ్గురు ఎమ్మెల్యే సీట్లను గెలుచుకుంది. ఆ తర్వాత వారంతా టీఆర్‌ఎస్ గూటికి చేరారు. ఇక టీఆర్ఎస్ తో ఉన్న అండర్ స్టాండింగ్ కారణంగా 2018 అసెంబ్లీ, 2019 లోక్‌సభతో పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీనే చేయలేదు. పార్టీ తరపున ఎలాంటి కార్యక్రమాలూ చేపట్టడం లేదు. కానీ పార్టీ మాత్రం కొనసాగుతోంది.
ఇలాంటి సమయంలో వైఎస్ అభిమానులను లక్ష్యంగా చేసుకుని షర్మిల పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పుడు తెలంగాణ వైసీపీలో మిగిలి ఉన్న నేతలు కూడా వైఎస్ అభిమానులే. దీంతో షర్మిల పార్టీలో చేరాలా వద్దా అన్న అయోమయం వారిలో నెలకొంది. ఈ సమయంలో ఇప్పుడు అందరి దృష్టి వైసీపీ తెలంగాణ ఇంచార్జీ గట్టు శ్రీకాంత్‌రెడ్డిపైనే ఉంది. ఆయన ఏ సలహా ఇస్తారా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మరి గట్టు ఏమంటారో చూడాలి.