తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన అక్కడకు ఎందుకు వెళ్లారో సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం లోన్లు, కమీషన్ల కోసమే వచ్చారని విమర్శిస్తోంది. ఇలాంటి సమయంలో వైటీపీ అధ్యక్షురాలు షర్మిల కూడా సీఎం ఢిల్లీ టూర్ పై స్పందించారు.
దూపైనప్పుడు బాయి తవ్వుకునుడు, చేతులు కాలాక ఆకులు పట్టుకొనుడు.. కేసీఆర్ కు అలవాటేనని విమర్శించారు. వర్షాలతో మూసీ ఉప్పొంగి పరివాహక ప్రాంతాలు మునిగిపోతున్నాయన్నారు. ప్రతీ ఏటా ఇదే పరిస్థితి ఉంటోందని.. అయినా కూడా ముందస్తు చర్యలు తీసుకోరు అంటూ మండిపడ్డారు.
వరదలు వచ్చినప్పుడు, జనం కొట్టుకుపోయి చచ్చినప్పుడే మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు తొలగిస్తామని చెప్పుడే కానీ చేతలు మాత్రం ఉండవని ఫైరయ్యారు. వర్షాలు వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతుంటే సహాయక చర్యలు పర్యవేక్షించాల్సిందిపోయి ఢీల్లీలో దొర రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో వరదలు వచ్చి ఇండ్లు మునిగిపోతే మీకెందుకు, జనం చస్తే మీకెందుకు, మీకు మీ రాజకీయాలే ముఖ్యం కదా? అంటూ కేసీఆర్ పై ఫైరయ్యారు షర్మిల. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు పోటెత్తడంతో జంట జలాశయాల నుంచి నీటిని దిగువకు వదిలారు. దీంతో మూసీ ఉగ్రరూపం దాల్చింది. పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి.