వైఎస్సార్ కూతురుగా, వైఎస్ జగన్ చెల్లిగా తెలుగు ప్రజలకు సుపరిచితులైన వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీకి రంగం సిద్ధమయ్యింది. అభిమానులతో ఆత్మీయ కలయిక అంటూ కొంతమందికి ప్రత్యేక ఆహ్వానాలు పంపి… హైదరాబాద్ లోటస్ పాండ్ లో సమావేశం అవుతున్నారు.
ముందుగా నల్గొండ జిల్లా నేతలతో షర్మిల సమావేశం కానుండగా… తెలంగాణ వైసీపీ వ్యవహరాలు చూసే నాయకులంతా అక్కడే ఉన్నారు. తను గతంలో తెలంగాణ లో కొన్ని జిల్లాలు పర్యటించిన నేపథ్యంలో, పార్టీ ఏర్పాటుపై తను ఓ ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ఉదయం నుండి ఊహాగానాలు వినిపించాయి.
లోటస్ పాండ్ భయట భారీగా గుమిగూడిన ప్రజలకు, అభిమానులకు అభివాదం చేసిన షర్మిల… కొత్త పార్టీపై పెదవి విప్పారు. కొత్త పార్టీ పెట్టబోతున్నారా అని జర్నలిస్టులు ప్రశ్నించగా… అందరితో మాట్లాడుతున్నా, ప్రతి జిల్లా నేతలతో మాట్లాడుతానని… తెలంగాణలో ఉన్న క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకే ఈ మీటింగ్ లు ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం లేదని, రాజన్న రాజ్యం తీసుకొచ్చేందుకు ముందుకొస్తున్నట్లు ప్రకటించారు.
ఇక లోటస్ పాండ్ ఇంటి వద్ద వెలసిన బ్యానర్లు సైతం… తను పార్టీ పెట్టేందుకే మొగ్గుచూపుతున్నారని, అవసరం అయితే పాదయాత్రతో ప్రజల్లోకి వెళ్లబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.