ఎనిమిదేళ్లుగా సీఎం కేసీఅర్ ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని మండిపడ్డారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర.. హుజూర్ నగర్ నియోజక వర్గం గరిడేపల్లి మండలంలో కొనసాగుతోంది. పోనుగోడు గ్రామస్తులను కలిసిన ఆమె కేసీఆర్ ప్రభుత్వంపై ఫైరయ్యారు. మాట ఇవ్వడం, మాట మీద నిలబడటం అంటే కేసీఆర్ కు తెలియదన్నారు. రాష్ట్రాన్ని ఆయన చేతిలో పెడితే అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. ప్రతి కుటుంబం మీద 4 లక్షల అప్పు మోపారని ఆరోపించారు.
4 లక్షల కోట్ల అప్పులు తెచ్చినా ఒక్కో కుటుంభానికి లక్ష రూపాయల ప్రయోజనం లేదన్నారు షర్మిల. పేదవాడు అంటే కేసీఆర్ కు పురుగుల్లా కనిపిస్తారని విమర్శించారు. బడులు,గుడులు లేవు కానీ.. మద్యం మాత్రం ఏరులై పారుతోందన్నారు. బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఅర్ తాగుబోతుల తెలంగాణగా చేశారని ఘాటు విమర్శలు చేశారు. ఇది బంగారు తెలంగాణ కాదు.. బార్లు, బీర్ల తెలంగాణ అంటూ ఫైరయ్యారు. ఓట్లు కావాల్సి వచ్చినపుడు మాత్రమే కేసీఆర్ బయటకు వస్తారని విమర్శించారు.
గాడిదకు రంగు పూసి ఇదే అవు అని నమ్మించే ఘనుడు కేసీఆర్ అని అన్నారు షర్మిల. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ఆయనను ఎదిరించలేకపోతున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లా అమ్ముడు పోయారని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో రూ.70 వేల కోట్ల కమీషన్లు కేసీఆర్ తీసుకున్నారని ఆరోపించారు. బీజేపీ ఆధారాలు ఉన్నాయని చెప్తోంది కానీ బయట పెట్టదన్న షర్మిల.. అందరూ దొంగలే వారి ప్రయోజనాలు వారికి ముఖ్యమని అన్నారు.
పాలకులు తెలంగాణలో సమస్యలు లేవని చెప్తున్నారని.. కానీ అడుగడుగునా ఉన్నాయని తెలిపారు. సమస్యలను ఎత్తి చూపేందుకే కుటుంబాన్ని వదిలేసి పాదయాత్ర చేస్తున్నానని చెప్పారు. ప్రజల పక్షాన నిలబడతానని.. వైటీపీ కొత్త పార్టీనే అయినా వైఎస్సార్ ప్రజలకు కొత్త కాదన్నారు. వైఎస్సార్ ను అభిమానించే ప్రతి ఇంటిపై ఆయన జెండా రెపరెపలాడాలని.. ఆనాటి సంక్షేమం తమ పార్టీతోనే సాధ్యమని వ్యాఖ్యానించారు షర్మిల.