సూర్యాపేట జిల్లాలో వైఎస్ఆర్టీపీ పార్టీ అధినేత్రి షర్మిల చేస్తున్న ప్రజాప్రస్థానం విరామం లేకుండా సాగుతోంది. బుధవారం చివ్వెంల మండల కేంద్రంలో ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులకు మద్దతు తెలిపారు షర్మిల. ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న షర్మిల.. ఉపాధ్యాయుల సమస్యలను ఉద్ధేశించి మాట్లాడారు.
రాష్ట్రంలోని వివిధ పాఠశాలల్లో ఉన్న ఖాళీ పోస్ట్ లను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్ధులకు పాఠ్యపుస్తకాలను వెంటనే అందించాలని డిమాండ్ చేశారు.
టీచర్ల సమస్యలకు మద్దతుగా వైఎస్ఆర్టీపీ అండగా ఉంటోందని చెప్పారు. గతంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో పిల్లల చదువుల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని గుర్తుచేశారు. వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉపాధ్యాయుల డిమాండ్స్ అన్ని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరుగిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని సీఎం కేసీఆర్ నెరవేర్చలేదని విరుచుకుపడ్డారు.