కేసీఆర్.. ఆయన కుటుంబం బాగుంటే సరిపోతుందా? అని ప్రశ్నించారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. సీఎం ఏం పని చేసినా కమీషన్లు, కుటుంబం కోసమే చేస్తారని విమర్శించారు. కాళేశ్వరం ఎందుకు కట్టారన్న ఆమె.. ధరణి తీసుకురావడం వల్ల ఎవిరికి ఉపయోగం జరిగిందో చెప్పాలని నిలదీశారు.
రైతు ఎంతకాలం బతికి ఉంటే అంతకాలం బీమా అందించాలని డిమాండ్ చేస్తూ కేసీఆర్ కు షర్మిల బహిరంగ లేఖ రాశారు. కౌలు రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇక కేసీఆర్ జాతీయ రాజకీయాలపై స్పందిస్తూ.. తెలంగాణనే అమ్మేస్తున్నారు? దేశాన్ని కూడా అమ్మేస్తారని సెటైర్లు వేశారు.
రాష్ట్రంలో ఏం చేశారని కేంద్రంలోకి వెళ్తారంటూ కేసీఆర్ ను ప్రశ్నించారు షర్మిల. ముందు ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నారు. తెలంగాణలో ఏం ఉద్దరించారని విమర్శించారు. కేంద్రంలోకి కేసీఆర్ వెళ్తే వేలల్లో జరిగే ఆత్మహత్యలు కాస్త లక్షల్లోకి పెరుగుతాయని ఆరోపించారు.
రైతుల సమస్యలను పక్కదారి పట్టించేందుకే డ్రగ్స్ అంశాన్ని తెరమీదకు తీసుకొచ్చారని అన్నారు షర్మిల. ముందస్తు వస్తే తమ నెత్తిన పాలు పోసినట్లేనని.. కేసీఆర్ ఎంత తొందరగా దిగిపోతే అంత మంచిదని వ్యాఖ్యానించారు.