దళితులను కేసీఆర్ ఎన్ని రకాలుగా మోసం చేయాలో.. అన్నీ చేశారని విమర్శించారు వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో దళిత భేరీ కార్యక్రమంలో ఆమె ప్రసంగించారు. కేసీఆర్ పాలనకు చావు డప్పు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడింది దళితులేనన్న ఆమె.. కేసీఆర్ మోసాలు అన్నీఇన్నీ కావని విమర్శలు చేశారు.
రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ దళిత బంధు అమలు చేయాలని డిమాండ్ చేశారు షర్మిల. ప్రతీ దళిత కుటుంబానికి రూ.10 లక్షలు కాదు… కేసీఆర్ రూ.61 లక్షలు బాకీ పడ్డారని విమర్శించారు. 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే వాటి గురించి మాట్లాడడం లేదన్నారు. నిరంకుశ పాలనకు చమరగీతం పాడి ఆత్మగౌరవం కోసం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పని చేస్తుందని చెప్పుకొచ్చారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుకు కేసీఆర్ డబ్బులు కుమ్మరిస్తున్నారని ఆరోపించారు.
కేసీఆర్ సీఎం అయ్యాక దళితులపై దాడులు 800 రెట్లు పెరిగాయన్నారు షర్మిల. నేరేళ్ల, తుంగతుర్తి ఘటనలు ఎన్నో జరిగాయని ఆరోపించారు. కేసీఆర్ మెదడు మత్తు బారిపోయిందని… ఆయనకు దళితులపై ఉన్నది దొంగ ప్రేమేనని సెటైర్లు వేశారు. తెలంగాణలో వేల కోట్ల రూపాయల భూములను కేసీఆర్, కేటీఆర్.. బినామీల పేరుతో కొంటున్నారని విమర్శలు చేశారు. ఇక తుంగతుర్తి నియోజకవర్గం నుంచి తమ పార్టీ అభ్యర్థిగా ఏపూరి సోమన్నను నిలబెడతామన్నారు షర్మిల.