టీఆర్ఎస్ పార్టీ నిధుల నుంచి కేసీఆర్ రైతులకు పరిహారం చెల్లించాలని వైటీపీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. హైదరాబాద్ లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ఫాం హౌస్ నుంచి బయటకు రావాలని.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం పనిచేయాలని హితవు పలికారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్ కు మహిళలు అంటే గౌరవం లేదని మండిపడ్డారు. గవర్నర్‌కు కూడా టీఆర్ఎస్ నేతలు కనీస మర్యాద ఇవ్వడం లేదని ఫైరయ్యారు.
కేసీఆర్ రాజులా, కేటీఆర్ యువరాజులా వ్యవహరిస్తున్నారని సెటైర్లు వేశారు షర్మిల. రాష్ట్రంలో పంట పండించడం కంటే వాటిని అమ్మడం పెద్ద సమస్యగా మారిందని పేర్కొన్నారు. వడ్లు అమ్ముకోగలం అన్న నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వరి వేసిన రైతులు ఈ 6 నెలలు బిక్కు బిక్కుమంటూ బతికారని అన్నారు. రైతుల పక్షాన పోరాటం చేయడానికి నెల రోజులుగా రైతు గోస పేరుతో సమస్యలపై ప్రశ్నించినా.. సీఎం నుంచి స్పందన లేదని మండిపడ్డారు.
మార్కెట్ యార్డుల్లో అన్నదాతలను పట్టించుకునే నాథుడే లేడన్నారు. వారాల తరబడి వరి కుప్పలు పోసుకుని రైతులు కష్టాలు పడుతున్నారని.. కనీస సౌకర్యాలు లేకపోవడంతో వర్షాలకు ధాన్యం కొట్టుకుపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ సొంత జిల్లా మెదక్ లోనూ ఇదే దుస్థితి ఉందన్నారు. సీఎం జిల్లాలోనే కొనుగోళ్లు జరగడం లేదని.. రాష్ట్ర వ్యాప్తంగా దారుణ పరిస్థితులు ఉన్నాయని తెలిపారు.
కేసీఆర్ మత్తు వీడితేనే రైతుల కష్టాలు తీరుతాయన్నారు షర్మిల. మద్దతు ధర ఇవ్వలేకపోతున్న ప్రభుత్వం.. కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని తీసుకోవడం లేదని మండిపడ్డారు. రైతుల శ్రమను కేసీఆర్ సర్కార్ దోచుకుంటోందని ఆరోపించారు. రైతుల సంక్షేమం అని చెప్పుకునే కేసీఆర్.. గిట్టుబాటు ధర ఎందుకు కల్పించడం లేదని నిలదీశారు. ధనిక రాష్ట్రమని గొప్పలు చెప్పుకునే కేసీఆర్.. రైతులకు బోనస్ ఇవ్వలేరా అని ప్రశ్నించారు.
ఇక కాంగ్రెస్ పార్టీపైన స్పందించిన షర్మిల.. టీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండదని రాహుల్ గాంధీ చెప్పుకునే స్థాయికి ఆ పార్టీ పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలంతా ఆ రెండు పార్టీలు కలిసిపోతాయని భావిస్తుండటం వల్లే రాహుల్ గాంధీ ఈ ప్రకటన చేశారని చెప్పారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ రాజకీయాలను తెలంగాణ ప్రజలంతా గమనిస్తున్నారని తెలిపారు. వరంగల్ సభలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలను.. ఆపార్టీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ముందు అమలు చేయాలన్నారు. అప్పుడే తెలంగాణ ప్రజలకు నమ్మకం కలుగుతుందని చెప్పారు షర్మిల.