వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోకుండా శుక్రవారం నుంచి షర్మిల దీక్ష చేస్తున్నారు. రెండో రోజు కూడా వైఎస్ షర్మిల ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. మరోసారి కేసీఆర్ నియంత అని నిరూపించుకున్నాడన్నారు. గౌరవ హైకోర్టు పాదయాత్రకు పర్మిషన్ ఇచ్చినా.. కేసీఆర్ అనుమతి ఇవ్వడం లేదంటున్నారు. పోలీసుల భుజాన తుపాకీ పెట్టి పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నాడన్నారు. న్యాయస్థానం అంటే కేసీఆర్ కు గౌరవం లేదంటూ విమర్శలు చేశారు షర్మిల. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే సాహసం చేస్తున్నాడన్నారు. కేసీఆర్ పతనానికి ఇది నాంది అంటూ ఆమె వ్యాఖ్యానించారు. పోలీసులను అడుగడుగునా వాడుకుంటూ.. మమ్మల్ని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు.
నర్సంపేటలో మా బస్సును, వాహనాలను, వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారు. పెట్రోల్ తో, కర్రలతో దాడులు చేశారన్నారు. లా అండ్ ఆర్డర్ ను కాపాడాల్సిన పోలీసులు వాళ్లను వదిలి మమ్మల్ని అరెస్ట్ చేశారని ధ్వజమెత్తారు. లా అండ్ ఆర్డర్ సమస్య సృష్టించింది టీఆర్ఎస్ అన్నారు. మళ్లీ అదే పోలీసులను అడ్డం పెట్టుకుని.. నేను కారులో ఉండగానే లాక్కెళ్లారన్నారు. బెయిల్ మంజూరు చేయకుండా రిమాండ్ కు తరలించాలని కుట్ర చేశారన్నారు షర్మిల. ట్రాఫిక్ సమస్యను అడ్డం పెట్టుకుని రిమాండ్ కు తరలించాలని చూడడం సిగ్గు చేటన్నారు. అయినా గౌరవ న్యాయస్థానం మాకు బెయిల్ ఇచ్చిందన్నారు. కేసీఆర్ నియంత పోకడలను నిరసిస్తూ శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చామన్నారు.
అక్కడ కూడా పోలీసులను పని వాళ్లలా వాడుకొని మమ్మల్ని అరెస్ట్ చేశారన్నారు. నన్ను ఒక్కదాన్ని మాత్రమే ఇంటి వద్ద వదిలిపెట్టి, మా పార్టీ శ్రేణులను అరెస్ట్ చేశారు. ప్రశ్నించే గొంతుకలకు కేసీఆర్ సంకెళ్లు వేస్తున్నాడని ఆరోపించారు. ఆర్ఎస్ఎస్ కు బీజేపీ లాగే.. ఈ రాష్ట్ర పోలీసులు కేసీఆర్ కు పనిచేస్తున్నారు. సొంత సైనికుల్లా పోలీసులు తయారయ్యారు. పాదయాత్రలో ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను బయటపెడితే మాపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కాళేశ్వరంలో కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తే.. మాపై కుట్ర చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ అని వాళ్లు సంబరాలు చేసుకోవచ్చు. మేం మాత్రం కనీసం నిరాహార దీక్షలు కూడా చేసుకోనివ్వరా? అంటూ ఆమె నిలదీశారు.
నల్లిని నలిపేసినట్లు నలిపేస్తాం.. బయట అడుగు పెట్టనీయం.. బలి ఇస్తాం.. ఏదైనా జరిగితే మా బాధ్యత కాదు.. అని నాపైనే వ్యక్తిగత దూషణలకు పాల్పడ్డారన్నారు. శిఖండి అని ఒక మహిళా ప్రజా ప్రతినిధి తోటి మహిళను పట్టుకుని దూషించిందన్నారు. నేను ఆమెను సూర్పనక అంటే ముఖం ఎక్కడ పెట్టుకుంటుంది? కానీ అలా అనే సంస్కారం నాది కాదు. అది నీ విచక్షణకే వదిలేస్తున్నా అంటూ పేర్కొన్నారు. గిరిజన మంత్రి సత్యవతి రాథోడ్ ఏనాడైనా మహిళ కోసం నోరు విప్పిందా? గిరిజన మహిళలను చీరలు పట్టి లాగి కొడుతుంటే ఏనాడైనా అడిగిందా? మహిళలపై అత్యాచారాలు జరుగుతుంటే ఏనాడైనా ప్రశ్నించిందా? మరియమ్మ అనే దళిత మహిళను లాకప్ లో కొట్టి చంపితే స్పందించిందా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
నన్ను మాత్రం శిఖండి అంటుందా? కొంచమైనా ఇంగితం ఉందా? పదవి ఉండగానే సరిపోతుందా? పదవికి తగ్గ హుందాతనం ఉండకూడదా? వ్యక్తిగత దూషణలు చేసింది నేనా? మీరా? అంటూ షర్మిల నిలదీశారు. వ్యక్తిగత దూషణలు నాపై చేస్తుంది టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే అని వెల్లడించారు. 3,500 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేస్తే ఒక్కసారైనా నిబంధనలు ఉల్లంఘించామా? మా ఫ్లెక్సీలు చింపినట్లు, వాళ్ల ఫ్లెక్సీలు మేం చింపామా? మాపై దాడి చేసినందుకు వాళ్లపై మేం దాడి చేశామా? అంటూ షర్మిల ప్రశ్నించారు.
ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్, ఆయన పార్టీ నాయకులు ఖూనీ చేస్తున్నారు. టీఆర్ఎస్ ఒకప్పుడు ఉద్యమకారుల పార్టీ.. కానీ ఇప్పుడు ఉద్యమ ద్రోహుల పార్టీ.. తాలిబన్ల పార్టీ.. గూండాల పార్టీ.. అవినీతిపరుల పార్టీ.. అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు కష్టమొస్తే ఒక్కసారైనా కేసీఆర్ ఆదుకున్నాడా? ఈయనట దేశాన్ని ఏలబోతాడట.. అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.. మా పార్టీ ఆఫీసు చుట్టూ కర్ఫ్యూ ఎత్తేయండి.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ నాయకుల్ని విడుదల చేయండి.. పాదయాత్రకు అనుమతి ఇవ్వండి.. లేదంటే ఆమరణ నిరాహార దీక్ష ఆగదు.. పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టుకోదు ఈ షర్మిల అంటూ ఆమె పేర్కొన్నారు. కాగా వైఎస్ షర్మిలకు మెడికల్ టెస్టులు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవన్స్ పరీక్షించారు అపోలో వైద్య నిపుణులు. నీళ్లు తాగకుండా ఉంటే.. ఆరోగ్యం త్వరగా క్షీణిస్తుందని వారు వెల్లడించారు.