– సత్తుపల్లి నియోజకవర్గంలో రైతు గోస ధర్నా
– కేసీఆర్ పై నిప్పులు చెరిగిన షర్మిల
– రైతుల్ని ముంచారు.. నిరుద్యోగులను ముంచారు
– కేసీఆర్ పాలనలో బాగుపండిందెవరు?
కేసీఆర్ పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజక వర్గం సదాశివునిపేటలో రైతుగోస ధర్నాలో ఆమె పాల్గొన్నారు. యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని, పంట వేయని రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని, దొంగ హామీలు ఇచ్చేందుకు మళ్లీ రెడీ అవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ను మళ్లీ మళ్లీ నమ్మి మోసపోవద్దని ప్రజలకు సూచించారు.
వరి వేయడం ఈసారి శాపం అయ్యిందన్న ఆమె.. కేసీఆర్ ఊసరవెల్లిలా మాటలు మార్చారని విమర్శించారు. ‘‘సన్నబియ్యం వేయండి అంటారు..దొడ్డు బియ్యం అంటారు.. కొంటాను అంటారు..కొనను అంటారు. ఒక్క మాట మీద అయినా నిలబడ్డాడా? వరి వేస్తే ఉరి అనడంతో 17 లక్షల ఎకరాలు బీడు భూములుగా మారాయి. కేసీఆర్ కొనను అని చెప్పడంతో వరి వేయడం మానేశారు. 35 లక్షల ఎకరాలలో పండిన పంటను సైతం కొనడం లేదు. మద్దతు ధర రూ.1960 ఏ ఒక్క రైతుకు కూడా రాలేదు. రూ.15 వందల లోపే అమ్ముకున్నారు. మద్దతు ధర ఉన్న వరి పంటకు కూడా ఇవ్వక పోతే ముఖ్యమంత్రి ఎందుకు ఉన్నట్లు? రైతులు నష్టపోవాలనేది కేసీఆర్ ఉద్యేశం. ఈసారి ఏ రైతు బాగుపడలేదు. ఎవరికీ లాభం రాలేదు’’ అని అన్నారు షర్మిల.
రైతులను బ్యాంక్ ల దగ్గర డీ ఫాల్టర్లుగా మిగిల్చారని.. వాళ్లను దొంగలుగా చూసేలా చేశారని మండిపడ్డారు. రైతుల ఇల్లు జప్తు చేస్తున్నారన్న ఆమె.. 8 ఏళ్లలో 8 వేల మంది అన్నదాతలు చనిపోయారని వివరించారు. ఆ రైతుల ఆత్మహత్యల పాపం ముమ్మాటికీ కేసీఆర్ దేనని.. ముష్టి రూ.5 వేలు ఇస్తే రైతులు కోటేశ్వరులు అవుతారా? అని ప్రశ్నించారు. రూ.25 వేలు ఇచ్చే పథకాలు బంద్ పెట్టి.. రూ.5 వేలు ఇస్తూ కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఫైరయ్యారు. ‘‘విత్తనాల సబ్సిడీ లేదు.. ఎరువుల మీద సబ్సిడీ లేదు. రైతులకు భరోసాగా ఉంటే ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటారు. 60 ఏళ్లు దాటితేనే బీమా అని రైతు నుదుటి మీద మరణ శాసనం రాస్తున్నారు. రైతును ఏ విధంగా ఆదుకోవడం లేదు. అన్ని రకాలుగా మోసం చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 8 ఏళ్లలో ఏ ఒక్క కుటుంబానికి న్యాయం జరిగిందో చెప్పాలి. చివరికి పెన్షన్లు కూడా సమయానికి ఇవ్వడం లేదు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం అవసరమా?’’ అని ప్రశ్నించారు షర్మిల.
కేసీఆర్ మంచం కోళ్లు ఎత్తుకు పోయే రకమని.. ఉద్యమకారుడు కదా అని రెండు సార్లు అధికారం ఇస్తే నెత్తిన టోపీ పెట్టారని అన్నారు. ‘‘ఎన్నికలు వస్తున్నాయి..మళ్ళీ వస్తాడు. ఈసారి బీసీ బంధు అంటారు.. ఎస్టీ బంధు అంటారు. రాష్ట్రం మీద కేసీఆర్ రూ.4 లక్షల కోట్ల అప్పులు చేశారు. ఆయన కుటుంబం మాత్రమే తెలంగాణలో బాగుపడింది. కల్వకుంట్ల ఫ్యామిలీకి 5 ఉద్యోగాలు కావాలి.. మీ బిడ్డలు మాత్రం హమాలీ పనులకు పోవాలా? పరిపాలన చేతకాకపోతే అధికారంలో ఉండి ఎం లాభం? వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే పార్టీ పెట్టాను. నమ్మకంగా సేవ చేస్తా అని మాట ఇస్తున్నా. వ్యవసాయాన్ని పండుగ చేస్తా. రైతును రారాజు చేస్తా.. భారీగా ఉద్యోగాలు ఇస్తాం. ఫీజ్ రీయంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ పథకాలు అమలు చేస్తా. ఇంట్లో ఎంత మంది ఉంటే అందరికీ పెన్షన్ల అందిస్తా’’ అని హామీ ఇచ్చారు షర్మిల.