టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే మునుగోడును దత్తత తీసుకుంటానంటూ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా వైఎస్ షర్మిల బోధన్ నియోజకవర్గంలో పర్యటించారు. దాదాపు 182 రోజులుగా సాగుతున్న ఈ పాదయాత్ర 2600 కిలో మీటర్లు దాటింది. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై తీవ్రంగా మండిపడ్డారు.
అయ్యా చిన్నదొరా.. కొడంగల్ కు కూడా ఇదే మాట ఇచ్చారు. కొడంగల్ లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తే కొడంగల్ ను దత్తత తీసుకుంటామన్నారు. దత్తత తీసుకుని అక్కడ ఏం ఉద్దరించారని.. ఇప్పుడు మునుగోడును దత్తత తీసుకుంటామని అంటున్నారని దూయబట్టారు షర్మిల. అయినా మీరు దత్తత తీసుకుంటే ఎంత.. తీసుకోకపోతే ఎంత అంటూ కేటీఆర్ ని ప్రశ్నించారు వైఎస్ షర్మిల.
జోగీ జోగీ రాసుకుంటే బూడిద రాలిందన్నట్టు.. అహంకారానికి, అధికార మదానికి మధ్య మునుగోడులో ఎలక్షన్ జరుగుతుందన్నారు. ఒక పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే.. మరో పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందన్నారు. మీరూ మీరూ కొట్టుకుంటే ప్రజలకు ఏం వస్తుందని ప్రశ్నించారు. ఉత్తి మాటలు, బూడిద తప్ప ప్రజలకు ఏం మిగులుతుందని వ్యాఖ్యానించారు షర్మిల.
మళ్లీ మీరేదో ఉద్దరిస్తున్నట్లు దత్తత అని మాట్లాడుతున్నారని ఆరోపణలు చేశారు. అసలు రాష్ట్రంలో ఏం అభివృద్ధి చేశారని ఆమె నిలదీశారు. మీ నియోజకవర్గాలైన గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటలో తప్ప ఇంకెక్కడైనా అభివృద్ధి చేశారా? ఈ మూడు నియోజకవర్గాలకు మాత్రమే కేసీఆర్ సీఎంనా? మీరు మంత్రా? అని షర్మిల విమర్శించారు. మీ నియోజకవర్గాలకు మాత్రమే వందల కోట్లు డెవలప్ మెంట్ ఫండ్ కింద నిధులు కేటాయించుకని వాటిని మాత్రమే అభివృద్ధి చేస్తే సరిపోతుందా? మిగతా రాష్ట్రంలోని ప్రజలు ఏం కావాలని తీవ్రంగా ఆగ్రహించారు వైఎస్ షర్మిల.