తెలంగాణ సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. లోటస్ పాండ్ లో మీడియాతో మాట్లాడిన ఆమె.. లక్ష రూపాయల రుణమాఫీ హామీని ఇంకా పూర్తి చేయలేదని మండిపడ్డారు. రైతుబంధు పేరుతో ఇతర పథకాలను నిలిపివేశారని.. కేసీఆర్ ఒకరోజు తనతో పాదయాత్ర చేయాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షర్మిల. షూ చూపిస్తూ.. కేసీఆర్ కు సైజ్ సరిపోకుంటే చెప్పాలని, రిటర్న్ ఆప్షన్ కూడా ఉన్నట్లుగా కామెంట్ చేశారు.
తన పాలనపై తనకు నమ్మకం ఉంటే తనతో ఒక్కరోజు పాదయాత్రకు రావాలని సవాల్ చేశారు షర్మిల. సమస్యలు లేవని రుజువైతే తాను ముక్కు నేలకు రాస్తానని స్పష్టం చేశారు. కేసీఆర్ పాలనలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదని పేర్కొన్నారు. రైతులకు రూ.5 వేలు ఇచ్చి రూ.30 వేల సబ్సిడీ ఆపేశారని ఫైరయ్యారు. ఉద్యమ సమయంలో గ్రూప్-1 పరీక్ష రాయకుండా అభ్యర్థులను రెచ్చగొట్టారని, ఇప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రం ఏర్పడ్డాక ఒక్కరికైనా గ్రూప్ ఉద్యోగం వచ్చిందా సమాధానం చెప్పాలని షర్మిల ప్రశ్నించారు.
కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి సీఎం అయ్యారని.. కానీ, తర్వాత వాటిని గాలికొదిలేశారని మండిపడ్డారు. నెరవేర్చని వాగ్ధానాలు ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు షర్మిల. ఈ ఏడాది ఏ స్కీమ్ పెట్టినా అది ఎన్నికల కోసమేననే విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. ఈ ఎనిమిదేండ్లలో కనీసం 25 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు కూడా కట్టలేదన్నారు. దమ్ముంటే కేసీఆర్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిపై ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో పబ్లిక్ ఫోరం నిర్వహించాలని డిమాండ్ చేశారు.
మరోవైపు మీడియాతో చిట్ చాట్ సందర్భంగా ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేశారు షర్మిల. బీఆర్ఎస్ పై తిరుగుబాటు జెండా ఎగురవేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేరికపై స్పందించారు. పొంగులేటి తమ పార్టీలో చేరతానని మాట ఇచ్చారని అన్నారు. లా అండ్ ఆర్డర్ ను అడ్డుపెట్టుకుని తన పాదయాత్రను అడ్డుకున్నారని మండిపడ్డారు.