బంగారు భారత్ అంటూ కేంద్రాన్ని ఢీకొడతానని చెబుతున్నారు సీఎం కేసీఆర్. ఇంతకీ బంగారు తెలంగాణ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు ప్రతిపక్ష నేతలు. తాజాగా ఇదే విషయంపై స్పందించిన వైటీపీ అధ్యక్షురాలు షర్మిల.. కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన ఇంత కాలం బూతులే మాట్లాడుతారు అనుకున్నా.. జోకులు కూడా బాగానే చెబుతున్నారంటూ సెటైర్లు వేశారు.
ఇది బంగారు తెలంగాణ కాదు.. తాగుబోతుల తెలంగాణ, ఆత్మహత్యల తెలంగాణ, అప్పుల తెలంగాణ, బానిసత్వపు తెలంగాణ, బతుకులేని తెలంగాణ అంటూ విమర్శించిన షర్మిల.. రాష్ట్రాన్ని మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారు.. అది సాధ్యమేనా? అని ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకే కేటీఆర్ విలీనం గురించి మాట్లాడారని మండిపడ్డారు. ఈ దరిద్రం ఇక్కడితో చాలు.. దేశం మొత్తం వద్దు అని చురకలంటించారు.
ఒకప్పుడు స్కూటర్ మీద తిరిగిన కేసీఆర్.. ఆయన కుటుంబాన్ని మాత్రం బంగారు కుటుంబం చేసుకున్నారని అన్నారు షర్మిల. తెలంగాణ బంగారం కాలేదు.. బొందల తెలంగాణగా మారిందని విమర్శించారు. 59 ఏళ్లు దాటిన రైతులకు బీమా ఎందుకు వర్తించట్లేదని ప్రశ్నించిన ఆమె… దీనిపై హైకోర్టును ఆశ్రయించామని.. 6 వారాల్లోగా వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలిపారు.
మద్యం తాగించకపోతే రాష్ట్రాన్ని నడపలేని పరిస్థితి ఉందని ఎద్దేవ చేశారు షర్మిల. బీజేపీ, ఎంఐఎం మతతత్వం గురించి మాట్లాడుతుంటే.. కేసీఆర్, కేటీఆర్ తెలంగాణ సెంటిమెంట్ ను వాడుకుంటున్నారని మండిపడ్డారు.