తెలంగాణలో కౌలు రైతుల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. ఆమె చేపట్టిన పాదయాత్ర కోదాడ నియోజకవర్గంలో కొనసాగుతోంది. మాట ముచ్చట కార్యక్రమంలో భాగంగా నడిగూడెం మండలం వల్లాపురం గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కౌలు రైతులు బ్యాంకుల దగ్గర డీ ఫాల్టర్లుగా మిగిలిపోయారని అన్నారు.
రాష్ట్రంలో మహిళలపై హత్యలు, అత్యాచారాలు గతంలో పోలిస్తే నాలుగు రెట్లు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు షర్మిల. ప్రభుత్వ వాహనాల్లో టీఆర్ఎస్ నేతల బిడ్డలే అత్యాచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.
ఇక చనుపల్లి సమీపంలో కోదాడ వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎక్కారు షర్మిల. ప్రయాణికుల కోరిక మేరకు బస్సు ఎక్కి వారితో ముచ్చటించారు. ఆర్టీసీ చార్జీలు భారీగా పెరగడంతో ప్రయాణం భారమయ్యిందంటూ వారంతా ఆమె దృష్టికి తీసుకెళ్లారు. 6 నెలలుగా వరుసగా ఛార్జీలు పెంచుతున్నారని వివరించారు. వైటీపీ అధికారంలోకి రాగానే ఆర్టీసీని పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు షర్మిల. బస్సు ఎక్కాక టిక్కెట్ సైతం తీసుకున్నారు.
అంతకుముందు.. పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ఓ రైతు కోరిక మేరకు పొలంలో ట్రాక్టర్ తో దుక్కి దున్నారు షర్మిల.