కేసీఆర్ అరాచక పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి కల్పించడమే తన లక్ష్యమన్నారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. గోదావరి పరివాహక ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. ధర్మపురిలో వరద బాధితులను కలిసి పరామర్శించారు. తెలంగాణలో రాబోయేది వైఎస్ఆర్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ ఆడబిడ్డల చేత కంటనీరు పెట్టిస్తున్నారని, ఆ పాపం ఊరికే పోదని హెచ్చరించారు.
కేసీఆర్ తెలంగాణ ప్రజల విశ్వాసం కోల్పోయారని ఆరోపించారు షర్మిల. వరదలతో నివాసాలు కోల్పోయిన అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. బాధితుల కష్టం చూస్తుంటే ఎంతో బాధేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. వరదలతో సర్వం కోల్పోయారని ప్రభుత్వం అండగా ఉండాల్సిన సమయం ఇది అని గుర్తు చేశారు.
తెలంగాణ ప్రజలు వైఎస్ఆర్ పాలనలోనే సుఖంగా ఉన్నారని అన్నారు షర్మిల. రాష్ట్రంలో రాజన్న రాజ్యం తెచ్చే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అందుకే ఆయన బాటలో పయనిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవడనికి పాదయాత్ర చేస్తున్నానని వివరించారు. ఈ కార్యక్రమంలో వైటీపీ నేతలు పాల్గొన్నారు.
ఇక కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో గ్రామస్తులు చేస్తున్న ధర్నాలో పాల్గొన్నారు షర్మిల. వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. అలాగే చొప్పదండి, మంచిర్యాల ప్రధాన రహదారిపై కూడా గ్రామస్తులతో కలిసి నిరసన తెలియజేశారు. ఆదిలాబాద్ వెళ్తుండగా గ్రామస్తులు ధర్నా చేయడం చూసి వారికి మద్దతు తెలిపారు షర్మిల.