తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా కొలిక్కిరాలేదు. హత్య జరిగి దాదాపు రెండు సంవత్సరాలు దగ్గరపడుతున్నా ఎవరు హత్య చేశారన్నది కనిపెట్టలేకపోయారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ చేతులెత్తేయగా… వైఎస్ వివేకా కూతురు సునీత అభ్యర్థన మేరకు రాష్ట్ర హైకోర్టు విచారణను సీబీఐకి బదిలీ చేసింది.
కానీ సీబీఐ కూడా తన విచారణను సాగదీస్తూనే ఉంది. దీంతో సునీత స్వయంగా రంగంలోకి దిగింది. తన తండ్రి హంతకులెవరో కనిపెట్టేందుకు ప్రముఖ మానవ హక్కుల కార్యకర్త కేరళకు చెందిన జోమున్ పుతెన్ ను సంప్రదించింది. తన తండ్రి హత్య కేసులో సహయం కోరినట్లు తెలుస్తోంది.
జోమున్ సిస్టర్ అభయ హత్య కేసులో ప్రభుత్వంతో పోరాడారు. ఆత్మహత్యగా పోలీసులు కేసు మూసివేయగా… సాక్ష్యాధారాలు సంపాదించి, హత్యగా నిరూపించారు. ఈ మొత్తం వ్యవహారంలో తనను చంపేస్తామని బెదిరింపులు వచ్చినా వెనుకడుగు వేయలేదు.
వైఎస్ వివేకా 2019, మార్చి 15న పులివేందులలోని తన స్వగృహంలో హత్య చేయబడ్డాడు.