ఏపీ మాజీ మంత్రి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సంచలన పరిణామాలు చోటుచేసుకోనున్నాయి. వివేకానందరెడ్డిని హత్య చేసింది ఎవరో సీబీఐ తేల్చేసింది.ఇందుకు తగిన సాక్ష్యాలు కూడా ఉన్నాయని పేర్కొంది. వివేకానందరెడ్డిని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డే చంపించారని..ఇందుకు సాక్ష్యాలున్నాయని సీబీఐ తెలంగాణ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.
ఈ క్రమంలో వివేకా హత్య కేసుతో సంబంధం ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి కూడా సీబీఐ విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో.. ఆయన సీబీఐ విచారణకు హాజరు కాలేనని పేర్కొన్నారు.
వ్యక్తిగత పనులు, ముందస్తు కార్యక్రమాలు ఉన్నాయని, విచారణకు హాజరు కాలేనంటూ సీబీఐకి సమాచారం ఇచ్చారు భాస్కర్ రెడ్డి. దాంతో భాస్కర్ రెడ్డి తదుపరి విచారణకు మరోసారి నోటీస్ ఇచ్చేందుకు సిద్ధమైంది సీబీఐ. ఈ నోటీసులు అందుకున్నాక విచారణకు కావాల్సిందేనని అధికారులు చెబుతున్నారు.
కాగా, శుక్రవారం నాడు సీబీఐ విచారణకు హాజరుకానున్నారు అవినాష్ రెడ్డి. మరోవైపు ఈ కేసులో స్పీడ్ పెంచిన సీబీఐ.. బుధవారం నాడు హైదారాబాద్ సీబీఐ కోర్టులో 68 పేజీలతో చార్జ్‌షీట్ దాఖలు చేసింది.