ఓ కేసులో ఎంతమంది అనుమానితులంటారు..?మహా అయితే పదుల సంఖ్యకు మించే ఉంటారు. కానీ ఏపీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న .. వైఎస్ వివేకానంద హత్య కేసులో 1461మంది అనుమానితులు ఉన్నారని పోలీసులు పేర్కొనడం విస్మయానికి గురిచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్యకేసులో పోలీసుల వ్యవహారశైలి అనుమానాలను గురిచేసేలా ఉంది. హత్య చేసినట్లుగా ఆనవాలు స్పష్టంగా కనబడుతున్న ఆత్మహత్యగా ప్రచారం చేస్తున్నారని కడప పోలీసులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఈ కేసులో పోలీసులు హైకోర్టుకు సమర్పించిన నివేదికలోని సమాచారం రాష్ట్ర ప్రజలను నోరెళ్లెబెట్టేలా చేస్తోంది. మొత్తంగా 1461మంది అనుమానితులు ఉన్నరని పేర్కొనడం.. రాయలసీమ ప్రజలపై రౌడీ షీట్ ముద్రేయడమేనని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే ఈకేసులో పోలీసుల ఎలాంటి పురోగతి సాధించకపోవడంతో టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసును సీబీఐ కి అప్పగించాలంటూ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసును పోలీసులు కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని… వైసీపీ రాజకీయ ప్రత్యర్థులను వేధించేందుకు ఓ కేసును అస్త్రంగా వాడుకోవాలని భావిస్తున్నారని రవి ఆరోపించారు. రవి పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఇప్పటి వరకూ జరిగిన దర్యాప్తు వివరాలను సమర్పించాలని అటు పోలీసుల్ని.. ఇటు హోంశాఖను ఆదేశించింది.ఈ కేసులో నిష్పక్షపాతంగానే వ్యవహారిస్తున్నామని పోలీసులు చెప్పుకొచ్చారు. ఇప్పటికి 1,523 మందిని ప్రశ్నించామని అఫిడవిట్ దాఖలు చేశారు. వీరిలో 1,461 మంది అనుమానితులు, 62 మంది సాక్షులని చెప్పుకొచ్చారు.
ఈ కేసుకు సంబంధించి అధారాలు కళ్లెదుటే కనిపిస్తున్న పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారో అంతుబట్టడం లేదని పలువురు పెదవి విరుస్తున్నారు. అందులోనూ సీఎం చిన్నాన్న హత్యకేసులో పోలీసుల సాగదీత ఏంటని మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ కేసును విచారించడానికి సీబీఐ అవసరం లేదని.. తాము డీల్ చేస్తామని హై కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.