కడప: వైఎస్ వివేకానందరెడ్డిని దారుణంగా హత్య చేసిన వారెవరు..? 5 నెలలుగా ఈ ప్రశ్నకు సమాధానం రావడం లేదు. నిందితుల ఆత్మహత్యల పరంపర మొదలైంది. త్వరగా వివేకా కేసు తేల్చకపోతే పోలీస్ వేధింపులకు మరికొందరు బలవుతారా..? ఈ అనుమానాలు నిందితులనుంచి వ్యక్తమవుతున్నాయి.
నిందితుడు శ్రీనివాసులురెడ్డి ఆత్మహత్య కలకలం రేపుతోంది. సూసైడ్ నోట్ రాతలో తేడాలున్నాయన్న కోణంలో దర్యాప్తు సాగుతోంది. నిజంగా శ్రీనివాసులురెడ్డికి ఈ కేసుతో సంబంధం లేదా…? నార్కో అనాలసిస్ రిపోర్టు ఏమిటి…?
ఆత్మహత్య చేసుకున్న నిందితుడు శ్రీనివాసులురెడ్డి బంధువు పరమేశ్వరరెడ్డి కేసు ఎంత త్వరగా తేలితే తాము అంత సేఫ్ అంటున్నారు. ‘వివేకా హత్యతో మాకు ఎలాంటి సంబంధం లేదు. 30 ఏళ్లుగా జగన్ కుటుంబానికి పనిచేస్తున్నాం. సీఎం జగన్కు ఇదే నా మనవి. కేసు త్వరగా తేల్చి మాకు పోలీస్ వేధింపుల నుంచి కాపాడండి, మహాప్రభూ…’ అంటూ శ్రీనివాసులురెడ్డి బంధువు వేడుకుంటున్నాడు. కేసుతో సంబంధం లేదు గనుకే నార్కో అనాలసిస్‌కు వెళ్ళాం. అసలు నిందితుల్ని సీఎం త్వరగా తేల్చాలని విన్నవించాడు.
మరీ ఇంత అన్యాయమా..? తప్పు చేయకపోయినా పోలీసులతో చిత్రహింసలకు గురవుతున్నాం. సీఎం తన అధికారాన్ని ఉపయోగించి అసలు నిందితుల్ని తేల్చితేనే మా ప్రాణాలు దక్కుతాయి. ఇది ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాసులురెడ్డి బంధువు మొర..!
ఇంతకూ సీఎం వివేకా హత్య కేసును సీరియస్‌గా తీసుకుని త్వరగా తేల్చుతారా..? ఎన్నికలకు ముందు అప్పటి అధికార టీడీపీ పక్ష నేతలపై అభియోగాలు మోపిన వైసీపీ ఇప్పుడు అసలు నిందితులను తేల్చుతుందా ? కోడి కత్తి కేసు మాదిరిగానే వివేకా కేసు మారుతుందా..? ఇంకా మరెందరు నిందితులు ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.? ఈ ప్రశ్నలకు జగన్ సర్కార్ సమాధానం చెప్పాల్సి ఉంది.