వైసీపీలో జగన్ తర్వాత నెంబర్ 2 నేతగా విజయ సాయి రెడ్డికి పేరుంది. కానీ గత కొంత కాలంగా వైసీపీ అధినేతకు, ఈయనకు మధ్య దూరం పెరుగుతోందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇటీవల విజయసాయి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీఎం, ఎంపీ మధ్య మనస్పర్థలు మరింత పెరిగినట్టుగా పార్టీ శ్రేణులే మాట్లాడుకుంటున్నారని టాక్. ముఖ్యంగా ఆయన తీరుపై సొంత పార్టీ నేతలే తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయన తన వ్యాఖ్యల ద్వారా పార్టీ లక్ష్మణ రేఖ దాటుతూ హైకమాండ్ ను రెచ్చగొట్టే, సవాలు చేసేలాగా ప్రవర్తిస్తున్నారని చెబుతున్నారు.
విశాఖలో భూములు, ఆస్తుల వ్యవహారంలో సొంత పార్టీ నేతలను ఇరకాటంలో పడేసేలా విజయసాయి చేసిన వ్యాఖ్యలపై పార్టీలో తీవ్ర చర్చ నడుస్తున్నట్టు సమాచారం. ఇక సొంత మీడియా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు పార్టీ సహచరుడు, తోటి ఎంపీపై విజయసాయి విమర్శలు చేయడంపైనా సర్వత్రా చర్చ సాగుతోంది. విశాఖపట్టణానికి ఆయన్ని పార్టీ ఇంఛార్జీగా నియమించినా తన ప్రభావాన్ని చూపలేకపోయారని, అందువల్ల ఆయన్ని మరోసారి ఆ పదవికి నామినేట్ చేయకూడదని పార్టీలో పలువురు అభిప్రాయ పడుతున్నారు.
విజయసాయిపై ఎన్నో ఫిర్యాదులు వచ్చాయని, వాటిని పట్టించుకోకుండా సీఎం రెండోసారి ఎంపీగా ఆయనకు జీవితాన్ని ఇచ్చారని అంటున్నారు. ముఖ్యంగా తన వ్యక్తిగత ప్రయోజనాల కోసం సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారని, ఈ క్రమంలో ఇతరుల బ్రాండ్ ను తగ్గించేలాగా ప్రయత్నిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆమధ్య రెండో సారి ఎంపీగా నామినేట్ చేసినందుకు కృతజ్ఞతలు చెబుతూ ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం జగన్ తో పాటు వైఎస్ భారతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పార్టీ విషయాల్లో భారతి కీలక పాత్ర పోషిస్తున్నారనే రాంగ్ మెసేజ్ ను పంపినట్లయిందనే చర్చ సాగుతోంది.
ఓ వైపు తన కుటుంబ సభ్యులను ప్రభుత్వాన్ని దూరంగా ఉంచుతున్నట్టు జగన్ ఇమేజ్ క్రియేట్ చేస్తూ వస్తుండగా విజయ సాయిరెడ్డి తన వ్యాఖ్యలతో ఇబ్బంది కలిగించారని పేర్కొంటున్నారు. ఈ పరిణామాల క్రమంలో విజయసాయిపై పార్టీ హైకమాండ్ ఆగ్రహంగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఇన్ సైడర్ ట్రేడింగ్, ప్రత్యేకంగా అక్రమ పద్దతుల్లో భూములను పొందారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై చాలా సీరియస్ గా ఉన్నట్టు వెల్లడిస్తున్నారు. దీన్నిబట్టి విజయసాయిపై అగ్రనాయకత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.