రాష్ట్ర విభజన తీరు అసంబద్దం అని సుప్రీంకోర్టు లో కేసు విచారణలో కేసు ఉంది అన్నారు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి . కుదిరితే మళ్లీ ఏపీ ఉమ్మడిగా కలసి ఉండాలన్నదే తమ పార్టీ విధానం అన్నారు.
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తాము తొలి నుంచీ పోరాడుతున్నామని.. ఉండవల్లి అరుణ్ కుమార్ పనిగట్టుకుని జగన్ వైపు చూపించినట్లు తెలుస్తోందన్నారు. ఆయన వ్యాఖ్యలు అసందర్భంగా ఉన్నాయని.. సీఎం జగన్‌పై ఉద్దేశపూర్వకంగానే వ్యాఖ్యలు చేసినట్లు ఉందన్నారు.
అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ విభజనకు అనుకూలంగా వ్యవహరించాయన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా తొలి నుంచీ పోరాటం చేస్తోంది వైఎస్సార్‌సీపీ మాత్రమే అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో జగన్ ముందు ఉంటారని.. అందుకోసం ఏ అవకాశాన్ని వదులుకునేది లేదన్నారు.
మళ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాగలిగితే తొలుత స్వాగతించేది వైఎస్సార్‌సీపీనే అన్నారు. విభజనకు వ్యతిరేకంగా కోర్టుల్లో తమ వాదనలు బలంగా వినిపిస్తామని.. రాష్ట్ర విభజనను వెనక్కి తిప్పాలి, లేదంటే సరిదిద్దాలని గట్టిగా కోరతామన్నారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కలసి ఉండాలన్నదే ఇప్పటికీ తమ విధానంగా చెప్పారు. మళ్లీ కలవడానికి ఏ వేదిక దొరికినా తమ పార్టీ, ప్రభుత్వం ఓటు వేస్తుందని.. కానీ అది సాధ్యమయ్యే పనికాదన్నారు. రాష్ట్ర విభజన చేసిన తీరుపైనే న్యాయస్థానంలో కేసు వేశారని.. విభజన చట్టంలో హామీల అమలు కోసం కాదని గుర్తు చేశారు. విభజన చట్టంలో హామీల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తూనే ఉందని.. రెండు రాష్ట్రాలు కలసి ఉండాలని సుప్రీంకోర్టు ఆదేశిస్తే అంతకంటే కావాల్సింది ఏముందన్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ లో అక్రమాలపై విచారణ జరుగుతుందన్నారు సజ్జల. చంద్రబాబు, లోకేష్ అక్రమాలు చేశారనే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయన్నారు. రాష్ట్రంలో 85శాతం పైగా బీసీ ప్రతినిధులు జయహో బీసీ సభకు వచ్చారని.. జయహో సభలో సీఎం మాట్లాడేటప్పుడు ఖాళీ కుర్చీలు ఉన్నాయంటూ కొన్ని మీడియా సంస్థలు విషం కక్కుతున్నాయన్నారు.
దింపుడు కళ్లెం ఆశతో జగన్ పై వ్యతిరేకత ఉన్నట్లు సృష్టిస్తున్నారన్నారు సజ్జల. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ తగ్గడానికి టీడీపీనే కారణమన్నారు. ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి కోర్టులో కేసు వేసి బీసీల రిజర్వేషన్ పై కేసు వేసి రిజర్వేషన్లను అడ్డుకున్నారని.. రాష్ట్రానికి ప్రథమ శత్రువులు చంద్రబాబు, టీడీపీనే అని ధ్వజమెత్తారు. భవిష్యత్తులో ఎస్సీ, మైనార్టీల కోసం సభలు పెడతామన్నారు.