సినీ నటుడు, టీడీపీ కీలక నేత నందమూరి తారకరత్నకు ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా మోకిల గ్రామంలోని తారకరత్న నివాసానికి చంద్రబాబు చేరుకున్నారు. అక్కడ తారకరత్న భౌతిక కాయానికి చంద్రబాబు నివాళులు అర్పించారు.
తారకరత్న కుటుంబసభ్యులను ఆయన ఓదార్చారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ తర్వాత అక్కడే ఉన్న వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిని చంద్రబాబు కలిశారు. కాసేపు ఆయనతో మాట్లాడారు. ఎప్పుడు విమర్శలు గుప్పించుకునే నేతలు ఇలా కలిసి మాటామంతి జరపడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఎంపీ విజయసాయి రెడ్డికి తారకరత్న భార్య అలేఖ్యరెడ్డి వరుసకు కూతురు అవుతారు. ఆయనకు ఆమె బాగా దగ్గరి బంధువు. అందువల్లే తారకరత్నను బెంగళూరు ఆస్పత్రిలో చేర్చగానే విజయసాయి రెడ్డి అక్కడకు వెళ్లి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడారు.
మరోవైపు నందమూరి తారకరత్నకు టీడీపీ అధినేత చంద్రబాబు మావయ్య అవుతారు. అలా చూస్తే చంద్రబాబు, విజయసాయిరెడ్డి బంధువులు అవుతారు. ఈ క్రమంలో తారకరత్నకు నివాళులు అర్పించిన సందర్భంలో వారిద్దరూ మాట్లాడుకోవడం ప్రత్యేకంగా కనిపించింది.