ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. గురువారం జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడిన నలుగురు ఎమ్మెల్యేలను జగన్ సర్కార్ సస్పెండ్ చేసింది. క్రాస్ ఓటింగ్ పై అంతర్గత విచారణ జరిపి.. ఆనం రామనారాయణరెడ్డి, మేకపాటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, చంద్రశేఖర రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిని సస్పెండ్ చేసింది. ఈ నలుగురు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే అభియోగంతో వైసీపీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో విప్ ఉల్లంఘించి క్రాస్ ఓటింగ్ కు పాల్పడినందుకు నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ విధిస్తున్నామని తెలిపారు. అంతర్గత విచారణ జరిపిన తర్వాతే పార్టీ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. మాకున్న సమాచారం మేరకు.. డబ్బులు చేతులు మారినట్లు పార్టీ విశ్వసిస్తోందన్నారు.
చంద్రబాబు ఎమ్మెల్యేలను కొన్నారు.. ఒక్కోక్కొరికి రూ.15 కోట్ల నుంచి రూ.20 కోట్లకు చంద్రబాబు ఆఫర్ చేశారని తెలుస్తోంది. క్రాస్ ఓటింగ్ చేసినవాళ్లకు టికెట్ కూడా ఇస్తామని టీడీపీ చెప్పి ఉండవచ్చు అని ఎమ్మెల్యే సజ్జల మీడియాకు వివరించారు. విశ్వాసం లేనప్పుడు పార్టీలో ఉంచడం అనవసరమనే సస్పెన్షన్ చేశామన్నారు. ప్రలోభపెట్టడం వల్లే మా వాళ్లు క్రాస్ ఓటింగ్ వేశారని చెప్పారు సజ్జల.
కాగా ఆనం రామ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవలి కాలంలో వైసీపీ అధినాయకత్వంపై విమర్శలు గుప్పిస్తూ వచ్చారు. ఉండవల్లి శ్రీదేవి తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని పేర్కొన్నారు. తాను గురువారం ఉదయమే సీఎం జగన్ ను కలిశానని చెప్పుకొచ్చారు. మరో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్లు సమాచారం. అన్ని విధాల సమాచారం సేకరించిన తర్వాత ఈ నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ సస్పెన్షన్ వేటు వేసింది. ప్రస్తుతం ఈ విషయం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.