వ్యవసాయ రంగానికి 24 గంటల కరెంట్ ఇస్తున్నామంటూ సీఎం కేసీఅర్ గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిలా మండిపడ్డారు. కరెంట్ కోతలు లేని పాలన అని అసెంబ్లీ సాక్షిగా సీఎం పచ్చి అబద్దాలు ఆడుతున్నారంటూ ఆమె ఫైర్ అయ్యారు.
రఘునాథ్ పల్లి సబ్ స్టేషన్ ఎదుట జాతీయ రహదారిపై ఆమె ధర్నా చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ… అమెరికాలోనైనా కరెంట్ కోతలు ఉంటాయట కానీ తెలంగాణలో మాత్రం ఉండవట అని సీఎం చెప్పారంటూ ఎద్దేవా చేశారు. రైతులకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం కాబట్టి తాము పవర్‌లో ఉంటామని చెబుతున్నారని అన్నారు.
కేసీఅర్ దొంగల ముఠా దొంగ మాటలు చెబుతోందన్నారు. ఇందులో వాస్తవం ఉందో లేదో తెలంగాణ రైతాంగానికి అంతా తెలుసన్నారు. రైతులకు వాస్తవ స్థితి అంతా తెలుసన్నారు. ఇదే రఘునాథ్ పల్లి మండలంలో పగలు 5 గంటలు కూడా కరెంట్ ఇవ్వడం లేదన్నారు.
అసలు విద్యుత్ శాఖ అధికారులకు కూడా ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదన్నారు. 15 నిమిషాల ముందు మాత్రమే మెసేజ్ వస్తది అంటని చెప్పారు. కరెంట్ ఎప్పుడు వస్తదో రైతుకు కూడా తెలియడం లేదన్నారు. ఈ సీజన్ లో రాష్ట్ర వ్యాప్తంగా 50లక్షల ఎకరాల్లో వ్యవసాయం సాగు అవుతోందన్నారు.
పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ధర్నాలు చేస్తున్నారని ఆమె వెల్లడించారు. రైతులు ధర్నాలు చేస్తుంటే కేసీఅర్ కి మాత్రం కనపడటం లేదన్నారు. అసెంబ్లీ వేదికగా పిచ్చి పిచ్చి ప్రకటనలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రైతుల ఆందోళన మీ కంటికి ఎందుకు కనిపించడం లేదన్నారు.
కూటిలో రాయి తీయనోడు, ఏట్లో రాయి తీస్తడట అని ఆమె ఎద్దేవా చేశారు. ఇక్కడ దిక్కులేదు కానీ..దేశం మొత్తం కరెంట్ ఇస్తాడట అంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆబ్ కి బార్ కిసాన్ సర్కార్ అని పిచ్చి మాటలు చెప్తున్నాడంటూ ఫైర్ అయ్యారు.
పిట్టల దొర లెక్క టోపీ పెట్టుకొని విమానాల్లో తిరిగి తమ సర్కార్ గొప్పది అంటే సరిపోతుందా..? అన్నారు. రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మీరు ఇచ్చే బోడి రూ. 5 వేలు రైతు బందు చాలక ఆత్మహత్యలు జరిగాయన్నారు.
వైఎస్సార్ ఇచ్చిన సబ్సిడీ పథకాలు అన్ని బంద్ పెట్టాడన్నారు. 30 వేల పథకాలు అన్ని బంద్ పెట్టి రైతులను కోటీశ్వరులు అంటే ఎలా అని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి ఏడాదీ సుమారు వెయ్యి కోట్ల పంట నష్టం జరుగుతోందన్నారు. ఇది ఆబ్ కి బార్ కిసాన్ సర్కార్ కాదని, కిసాన్ కి బర్బాత్ చేసిన సర్కార్ అంటూ ధ్వజమెత్తారు.