వైఎస్ హయాంలో ఎవుసం అంటే పండుగలా ఉండేదన్నారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. ఆమె చేపట్టిన ప్రజాప్రస్థానం పాదయాత్ర 79వరోజుకు చేరింది. రైతులకు ఏ కష్టమొచ్చినా వైఎస్ ఆదుకున్నారని.. అదే కేసీఆర్ అయితే.. రుణమాఫీ అని మోసం చేశారని విమర్శించారు.
రైతులకు అందే పథకాలన్నీ కేసీఆర్ బంద్ పెట్టారని ఆరోపించారు. ముష్టి రూ.5వేలు ఇచ్చి రైతులను కోటీశ్వరులను చేసామనడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతు బీమాను 60 ఏండ్లకే పరిమితం చేసి అన్యాయం చేశారని ఫైరయ్యారు.
“మన బిడ్డలు కులవృత్తులు చేసుకోవాలి.. కేసీఆర్ బిడ్డలు రాజ్యాలు ఏలాలి. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే రాష్ట్రం నాశనమవుతుంది. ఆయనకు ఓటు వేస్తే భవిష్యత్ మిమ్మల్ని క్షమించదు. పాలకులు మంచి వాళ్లు ఐతే ప్రజలు చల్లగా ఉంటారు. వైఎస్ఆర్ లాంటి నాయకత్వం కోసమే పార్టీ పెట్టాం” అని చెప్పారు షర్మిల.
ఇక బీజేపీ ప్రభుత్వం ప్రజలను గాలికొదిలి మత రాజకీయాలతో పబ్బం గడుపుతోందని విమర్శించారు. విభజన హామీలన్నీ అటకెక్కించారని ఆరోపించారు. ఇటు కాంగ్రెస్ పార్టీపైనా మండిపడ్డారు షర్మిల. కాంగ్రెస్ కు ఓటేస్తే ఆ లీడర్లు కేసీఆర్ కు అమ్ముడుపోయారని అన్నారు. వైఎస్ నాయకత్వాన్ని మళ్లీ తీసుకురావడమే లక్ష్యంగా తాము పని చేస్తామని స్పష్టం చేశారు.