‘ప్రజాప్రస్థాన యాత్ర’పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. ఈ నెల 28 నుంచి తిరిగి యాత్ర ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. పోలీసులు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా.. ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో.. అక్కడి నుంచే మొదలు పెడతానని పేర్కొన్నారు. నా పాదయాత్ర కేసీఆర్ పాలనకు అంతిమయాత్ర అవుతుందన్నారు. కేసీఆర్ 8 ఏండ్ల పాలనలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని షర్మిల ఆరోపించారు. వైఫల్యాలను ఎండగడుతూ, అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే తపై దాడులు చేయిస్తున్నారని దుయ్యబట్టారు.
తనకు ప్రజల్లో వస్తున్న ఆదరణ చూడలేకనే తనపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. ప్రజల కోసం ఎన్ని దాడులనైనా భరిస్తానని ఆమె స్పష్టం చేశారు. అన్నదాతలకు కేవలం రూ.5వేల రైతు బంధు ఇస్తున్న కేసీఆర్.. గతంలో వైఎస్సాఆర్ ఇచ్చిన రూ.30వేల లబ్ధిని ఆపేశారని షర్మిల మండిపడ్డారు. వైఎస్ తెచ్చిన ఆరోగ్య శ్రీ పథకానికి కేసీఆర్ తూట్లు పొడిచారని ఆరోపించారు.
కేసీఆర్ అవినీతిని ప్రశ్నించిన ఏకైక పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ మాత్రమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోనే కేసీఆర్ 70 వేల కోట్ల అవినీతి చేశారని ఎత్తి చూపి, పదే పదే మాట్లాడింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ మాత్రమే అన్నారు. పాదయాత్రకు విరామం ప్రకటించి మరీ ఢిల్లీ వెళ్లి కాగ్, సీబీఐకి ఫిర్యాదు చేశామన్నారు. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు ఒక్కరికే ఎందుకు ఇస్తున్నారు అని ప్రశ్నించారు.
అలాగే ప్రతీ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతిని ఎత్తిచూపిన ఏకైక పార్టీ వైఎస్సార్టీపీ అన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా , ఒడిదుడుకులు ఎదురైనా పోరాడుతున్నందుకు మాపై కక్ష కట్టి దాడులు చేసి, కేసులు పెట్టారన్నారు. ఒక మహిళ కారులో ఉండగానే లాక్కెళ్లి, అరెస్టు చేసి, గంటల తరబడి స్టేషన్ లో పెట్టి అక్రమ కేసులు పెట్టారని మండిపడ్డారు. పోలీసులు ఇంత తొత్తుల్లా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అంటూ నిలదీశారు.
నా గుండెలో నిజాయితీ ఉంది, ప్రజలకు సేవ చేయాలన్న తపన ఉంది ప్రజలను ఆశీర్వదించాలని కోరుతున్నామన్నారు. పాదయాత్ర ఫిబ్రవరిలో ముగించి పాలేరుపై దృష్టి పెడతామన్నారు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ పాలేరు నుంచి పోటీ చేస్తుందని మట్టి సాక్షిగా మాటిచ్చింది. ఇప్పుడు కూడా చెబుతున్నా నేను పాలేరు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు వైఎస్ షర్మిల.