– అసెంబ్లీకి ఎప్పుడు రమ్మంటారో చెప్పండి
– డేట్ మీరు ఫిక్స్ చేస్తారా? నన్ను చెప్పమంటారా..?
– అసెంబ్లీ లోపలకు రావాలా.. ముందే తేల్చుకుందామా?
– పబ్లిక్ గా మాట్లాడుకుందాం.. ఏం అడుగుతారో అడగండి
– మీ అవినీతి, అక్రమాల గురించే మాట్లాడతా..
– ఇక్కడ ఉన్నది పులి బిడ్డ.. భయపడే రకం కాదు
– టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుపై షర్మిల ఫైర్
కేసీఆర్ చేతిలో మోసపోని వర్గం లేదన్నారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. 8 ఏళ్లుగా ఆయన చేస్తోందంతా మోసమేనని విమర్శించారు. ప్రజాప్రస్థానం పాదయాత్ర షాద్ నగర్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. వైఎస్ఆర్ సర్కిల్ వద్ద ప్రజలనుద్దేశించి ప్రసంగించారు షర్మిల. కేసీఆర్ జన్మకి ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదని.. ఆయన దొంగ కాదు గజ దొంగ అని విమర్శించారు. వైఎస్సార్ ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని షాద్ నగర్ నియోజక వర్గం నుంచే ప్రారంభించారన్నారు. ఇలా ఆయన ఎంతో చేశారని.. కానీ, కేసీఆర్ చేసిందేంటని ప్రశ్నించారు.
లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ చేస్తామని తట్టెడు మట్టి ఎత్తలేదని.. కుర్చీ వేసుకొని కూర్చొని మరి పూర్తి చేస్తా అని మోసం చేశారన్నారు. ఇదే షాద్ నగర్ నియోజక వర్గంలో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు ఇస్తామని.. 8 ఏళ్లు అయినా పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. ‘‘షాద్ నగర్ నియోజక వర్గానికి ముగ్గురు ఎమ్మెల్యేలు అంట కదా. తండ్రి అంజయ్య యాదవ్ రబ్బర్ స్టాంప్ అంట కదా. మూడు కాయలు ఆరు పువ్వులు అనే స్థాయిలో దందాలు చేస్తున్నారు అంట కదా. వీళ్ళ ఆగడాలకు ఒక వ్యక్తి సెల్ఫీ వీడియో తీసుకొని మరి ఆత్మహత్య చేసుకున్నారట. వీళ్ళు మనుషులా…మృగాలా..? ఎమ్మెల్యే కాకముందు అంజయ్య యాదవ్ అప్పుల్లో ఉన్నాడట కదా. ఇప్పుడు వేల ఎకరాలు.. వేలకోట్ల ఆస్తులు. అగ్గువకు భూములు గుంజుకోవడం.. ఎక్కువకు అమ్ముకోవడం.. ఇదే తెలుసు ఈ ఎమ్మెల్యే కొడుకులకు. ఇది దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం. ప్రాణాలు తీస్తున్న ఈ ఎమ్మెల్యేకి ఆయన కొడుకులకు ఉసురు తగలక మానదు’’ అని మండిపడ్డారు షర్మిల.
షాద్ నగర్ నియోజక వర్గంలో పరిశ్రమలు ఉన్నా… స్థానికులకు ఉద్యోగాలు లేవని ఆరోపించారు. పరిశ్రమల కారణంగా కాలుష్యం పెరిగిందని.. కనీసం డ్రైనేజీ సమస్యకు కూడా పరిష్కారం చూపలేక పోయారని విమర్శించారు. ఎమ్మెల్యేల అవినీతిపై ఫిర్యాదు చేస్తే తనపైనే ఫిర్యాదు చేశారని మండిపడ్డారు. ‘‘వీళ్ళు భూ కబ్జాలు చేస్తే తప్పు లేదట…నేను మాట్లాడితే తప్పట. ఈ ఎమ్మెల్యేలు వేల కోట్లు అక్రమంగా సంపాదిస్తే తప్పు లేదట…నేను అడిగితే తప్పు వచ్చిందట. ఒక నీతి మాలిన మంత్రి మరదలు అంటే తప్పు లేదట… నేను ఎవడ్రా మరదలు అంటే తప్పు వచ్చిందట. స్పీకర్ కూడా సానుకూలంగా స్పందించడం బాధాకరం. ఇక నా మీద కేసులు పెడతారట.. నన్ను అసెంబ్లీకి పిలుస్తారట. దమ్ముంటే నన్ను రమ్మని చెప్పండి. నడుచుకుంటూ వస్తా.. కాలి నడకన వస్తా.. తలెత్తుకొని వస్తా.. ఎప్పుడు రమ్మంటారో చెప్పండి. మీరు డేట్ ఇస్తారా.. నన్ను చెప్పమంటారా..? అసెంబ్లీ లోపలకు రావాలా… అసెంబ్లీ ముందా? పబ్లిక్ గా మాట్లాడుకుందాం. ఏమి అడుగుతారో అడగండి. నేను ఏమి తప్పు మాట్లాడానో చెప్పండి. మీ అవినీతి గురించి… అక్రమాలు.. దౌర్జన్యాలు గురించి మాట్లాడతా. ఇక్కడ ఉన్నది పులి బిడ్డ. భయపడే రకం కాదు’’ అంటూ సవాల్ విసిరారు.
మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోవచ్చా..? అని ప్రశ్నించారు షర్మిల. దమ్ముంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సవాల్ విసిరారు. అరెస్ట్ చేసి చూడండి.. బేడీలకు భయపడే రకం కాదని మండిపడ్డారు. ప్రజల పక్షాన నిలబడాలని నిర్ణయం తీసుకున్నానని.. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ధైర్యంగా పోరాడతానని తెలిపారు. ప్రజలు అవకాశం ఇచ్చిన రోజు నమ్మకంగా ముఖ్యమంత్రి స్థాయిలో సేవ చేస్తానని.. అవకాశం ఇచ్చే వరకు పోరాటం సాగిస్తానని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి బిడ్డ అయిన తన ఫిర్యాదునే తీసుకోలేదని.. ఇక సాధారణ మహిళల పరిస్థితి ఎంటో అర్థం అవుతోందని విమర్శించారు. పోలీసులను కేసీఆర్ పనోళ్లగా మార్చేశారని ఆరోపించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఎలాగో కేసీఆర్ కు పోలీసులు అలాగని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలు పెరిగి మహిళలపై దాడులు పెరుగుతుంటే చర్యలు లేవని మండిపడ్డారు. తెలంగాణ దక్షిణ భారత్ లో మహిళల మీద అత్యాచారాలు చేయడంలో నెంబర్ వన్ లో ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు షర్మిల.