యాదాద్రి ఆలయం రాతి స్తంభాలపై చెక్కిన కేసీఆర్ బొమ్మ, ఇతర వివాదాలకు కారణమైన బొమ్మలపై దిగొచ్చిన ప్రభుత్వం.
కేసీఆర్ సహా అన్ని బొమ్మలను తొలగిస్తామన్న వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు.
భారీ పోలీస్ బందోబస్తు నడుమ బొమ్మల తొలగింపు చర్యలు చేపట్టిన అధికారులు.
కొండపైకి మీడియాను అనుమతి౦చని పోలీసులు
‘తొలివెలుగు’ వరుస కథనాలతో ప్రభుత్వంలో కదలిక
హైదరాబాద్: ప్రభుత్వం దిగొచ్చింది. ప్రజాగ్రహాన్ని చూసి భయపడి వెనక్కి తగ్గింది. ప్రముఖ ఆధ్యాత్మిక దివ్య క్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణంలో రెండు రోజులుగా ముదిరిన వివాదానికి ఫుల్‌స్టాప్ పెట్టింది. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా రూపుదిద్దుకుంటున్న అష్టభుజి ప్రాకార మండపం స్తంభాలపై కేసీఆర్, కేసీఆర్ కిట్, కేసీఆర్ పార్టీ కారు సింబల్, కేసీఆర్ పథకం హరితహారం, కారు గుర్తు మొదలైనవే కాకుండా బూతు చిత్రాలు కూడా చెక్కి వాటిని అడ్డంగా సమర్ధించుని ప్రజల ఆగ్రహాన్ని, ప్రతిపక్షాల విమర్శల్ని మూటగట్టుకున్న ప్రభుత్వం ఈ బొమ్మల్ని వెంటనే తొలగిస్తామని ప్రకటించింది. దీంతో ఈ వివాదాన్ని బయటి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చి ఆలయ ప్రతిష్టను కాపాడటంలో ‘తొలివెలుగు’ జరిపిన కృషి ఫలించినట్టుయ్యింది.
యాదగిరిగుట్టపై ఆలయ పునర్నిర్మాణంలో అపవిత్రమైన అంశాలు వున్నాయని ‘తొలివెలుగు’ ఇచ్చిన వార్తలతో తెలంగాణ సమాజంలో తీవ్ర దుమారం రేగింది. దేవాలయంలో వ్యక్తులు, పార్టీ గుర్తులు పెట్టడంమేంటని విమర్శలు వెల్లువెత్తాయి. కాంగ్రెస్, బీజేపీ నాయకులు యాదాద్రిలో ఆందోళన చేపట్టారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక భారీ ఎత్తున విమర్శలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకతప్పలేదు. వివాదాలకు కారణమైన కేసీఆర్ బొమ్మ సహా అన్ని బొమ్మలు తొలగిస్తామని వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్ రావు శనివారం సాయంత్రం ప్రకటించారు. అంతకుముందు ఆయన ఈ అంశంపై ప్రభుత్వ ముఖ్యులతో మాట్లాడి వారిని ఒప్పించినట్టు సమాచారం. కిషన్ రావు ప్రకటన దరిమిలా భారీ పోలీస్ బందోబస్తు నడుమ బొమ్మల తొలగింపునకు అధికారులు చర్యలు చేపట్టారు. యాద్రాద్రి కొండపైకి ప్రస్తుతం మీడియాను అనుమతించడం లేదు.