ఉద్యమ కారుడు కదా అని రెండు సార్లు పాలన పెడితే వెన్నుపోటు పొడిచారని కేసీఆర్ పై విరుచుకుపడ్డారు వైటీపీ అధ్యక్షురాలు షర్మిల. ఖమ్మం జిల్లా మదిర నియోజకవర్గంలో ఆమె పాదయాత్ర కొనసాగిస్తున్నారు. మడుపల్లి గ్రామ ప్రజలతో మాట్లాడిన ఆమె.. కేసీఆర్ పాలనలో ఎదురవుతున్న ఇబ్బందులు, ఆయన చసిన మోసాల గురించి వివరించారు. తెలంగాణలో కేసీఆర్ మోసం చేయని వర్గం లేదని విమర్శించారు.
8 ఏళ్లుగా ఆడింది ఆట.. పాడింది పాటగా పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు షర్మిల. ప్రశ్నించాల్సిన ప్రతిపక్షం మొద్దు నిద్రపోతోందని.. ప్రజల పక్షాన నిలబడేందుకే తాను పార్టీ పెట్టినట్లు వివరించారు. తనది వైఎస్సార్ రక్తమని.. ఆశీర్వదిస్తే పెద్దాయన పేరు నిలబెడతానని తెలిపారు. తాము అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తానని చెప్పారు.
ఆరోగ్యశ్రీని బ్రహ్మాండంగా అమలు చేస్తానన్న షర్మిల.. పోడు భూములకు పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు. నిత్యం తెలంగాణ గడ్డ అభివృద్ధి కోసం పరితపిస్తానని అన్నారు. ఆలోచన చేసి.. మీకోసం బాగుపడే వారికి అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.
కేసీఆర్ చేతిలోకి మరోసారి రాష్ట్రం పెడితే సర్వనాశనం చేస్తారని విమర్శించారు. వైటీపీని ఆశీర్వదించాలని.. వైఎస్సార్ సంక్షేమ తెలంగాణకు తీసుకొస్తానని తెలిపారు షర్మిల.