ఓవైపు రైతులు చస్తున్నా.. కేసీఆర్ సర్కార్ అవలంభిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఏదో కంటి తుడుపు చర్యలకు పాల్పడుతూ అన్నదాతలను నిర్లక్ష్యం చేస్తోందని ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ట్విట్టర్ వేదికగా వైటీపీ అధ్యక్షురాలు షర్మిల.. కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
బంగారు తెలంగాణలో అన్నం పెట్టే రైతు చావు కేకలను వినే దిక్కులేదన్నారు షర్మిల. పంట పాడైతే నష్టపరిహారం అందించే వారులేక, పెట్టిన పెట్టుబడి రాక, ఆదుకోవాల్సిన సర్కార్ రైతు చావులను సర్కస్ లా చూస్తుంటే.. కేసీఆర్ ను నమ్మలేక ఆఖరికి పురుగుల మందునే నమ్ముకొని రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు.
వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రలకు వెళ్లినట్టు.. కేసీఆర్ కూడా ఈ పాపం నాది కాదని పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారని సెటైర్లు వేశారు షర్మిల. వందల మంది రైతుల చావులకు కారణమైన ఈ పాపం ఊరికే పోదంటూ శాపనార్ధాలు పెట్టారు. అన్నదాతను కాటికి పంపుతున్న ఈ ప్రభుత్వానికి భవిష్యత్తులో పాడె కట్టేది.. మీ అధికారానికి పాతరేసేది రైతులేనని హెచ్చరించారు షర్మిల.