పీడీ యాక్ట్ తో అరెస్ట్ అయి జైలు పాలైన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కోసం మరో సంస్థ కదిలింది. గోవుల రక్షణ కోసం నిత్యం శ్రమించే.. యుగ తులసి ఫౌండేషన్ రాజాసింగ్ కోసం మహా నిరసన దీక్షకు పూనుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి హైదరాబాద్ ఇందిరాపార్క్ దగ్గరకు రావాలని పిలుపునిచ్చింది. దీనికి సంబంధించిన ప్రోమో వీడియోను విడుదల చేసింది.
రాజాసింగ్ ను అక్రమంగా పీడీ యాక్ట్ ప్రయోగించి అప్రజాస్వామికంగా నిర్బంధించారని తెలిపింది యుగ తులసి ఫౌండేషన్. ఇవాళ రాజాసింగ్ కోసం వచ్చారు.. రేపు మన కోసం వస్తారు. చూస్తూ ఉందామా? యుద్ధం చేద్దామా? అంటూ ఛలో ఇందిరా పార్క్ కు పిలుపునిచ్చింది.
అందరూ అక్టోబర్ 8న ఉదయం 10 గంటల కల్లా రావాలని కోరింది. ఈ నిరసన దీక్షను సాయంత్రం 4 గంటల వరకు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. రాజాసింగ్ ను అక్రమంగా అరెస్ట్ చేశారని ఆయన విడుదలయ్యే దాకా తమ పోరాటం ఆగదని స్పష్టం చేసింది. ఈ దీక్షకు పోలీసులు అనుమతినిచ్చారు.
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో కమెడియన్ మునావర్ షో నేపథ్యంలో రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఓ వర్గం వారిని కించపరిచారని అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అరెస్ట్ చేసిన విధానం సరిగ్గా లేదని కోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ, 24 గంటలు గడవక ముందే పాత కేసుల్లో కోర్టు చెప్పిన దాని ప్రకారం అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ పెట్టారు. అప్పటినుంచి ఆయన జైలులోనే ఉన్నారు.