ఎమ్మెల్యే రాజా సింగ్ పై పీడీ యాక్ట్ పెట్టి అక్రమంగా నిర్బంధించడాన్ని నిరసిస్తూ ధర్నా చౌక్ దగ్గర యుగ తులసి ఫౌండేషన్ మహా నిరసన దీక్ష నిర్వహించింది. ఈ దీక్షలో పలు హిందూ సంఘాలతో పాటు గో బంధువులు మద్దతు తెలిపి పాల్గొన్నారు. హిందూ దేవుళ్లను కించపరిచే మునావర్ షో కు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని ఫౌండేషన్ చైర్మన్ శివ కుమార్ ఈ సందర్భంగా మండిపడ్డారు.
ధర్మం కోసం పోరాడే రాజాసింగ్ పై పీడీ యాక్ట్ పెట్టడం దారుణమని.. వారం రోజులోపు రాజాసింగ్ ను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. హైందవ ఐక్యత చాటిచెప్పే విధంగా శాంతి యుతంగా ఈ దీక్షకు పూనుకున్నట్లు వివరించారు.
రాజాసింగ్ పై పీడీ యాక్ట్ ప్రయోగించి అప్రజాస్వామికంగా నిర్బంధించారని అన్నారు దీక్షలో పాల్గొన్నవారు. ఆయన విడుదలయ్యే దాకా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ లో కమెడియన్ మునావర్ షో నేపథ్యంలో రాజాసింగ్ ఓ వీడియో విడుదల చేశారు. అందులో ఓ వర్గం వారిని కించపరిచారని అల్లర్లు చెలరేగాయి. ఈ క్రమంలో ఆయన్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే అరెస్ట్ చేసిన విధానం సరిగ్గా లేదని కోర్టు బెయిల్ ఇచ్చింది. కానీ, 24 గంటలు గడవక ముందే పాత కేసుల్లో కోర్టు చెప్పిన దాని ప్రకారం అరెస్ట్ చేశారు. పీడీ యాక్ట్ పెట్టారు. అప్పటినుంచి ఆయన జైలులోనే ఉన్నారు.