తెలంగాణలో టీఆర్ఎస్ పాలన ఉండేది ఇంకా ఏడాదేనన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఢిల్లీలో యువ తెలంగాణ పార్టీ బీజేపీలో విలీనమైంది. జిట్టా బాలకృష్ణ, రాణి రుద్రమ బీజేపీ గూటికి చేరారు. బండి సంజయ్ ఆధ్వర్యంలో కాషాయ కండువా కప్పుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన బండి.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కేసీఆర్ ను ఎదుర్కోవడానికి అన్ని వర్గాలు కలిసి వస్తున్నాయని అన్నారు. అందుకు యువ తెలంగాణ పార్టీ విలీనమే నిదర్శమని తెలిపారు. జాతీయస్థాయిలో వార్తల్లో ఉండేందుకే సర్జికల్ స్ట్రైక్స్ పై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.
విద్యుత్ చట్టాల విషయంలో కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని.. మీటర్లు పెట్టమని చెప్పలేదని కేంద్రమంత్రి క్లారిటీ ఇవ్వడంతో సైలెంట్ గా ఉండిపోయారని విమర్శించారు. ఇంకో ఏడాది తర్వాత ముమ్మాటికీ బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలనే ఇంటిపోరు తట్టుకోలేక కేసీఆర్ దేశ రాజకీయాల రాగం అందుకున్నారని విమర్శించారు.
సర్జికల్ స్ట్రయిక్ విషయంలో తాను చేసిన ఆరోపణలు తప్పని కేసీఆర్ ఒప్పుకోవాలన్న బండి… తన పుట్టినరోజున దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గెలిస్తే టీఆర్ఎస్ గెలిచినట్లేనని.. ఆ రెండు పార్టీలు కలిసే పనిచేస్తాయని భావించినందునే యువ తెలంగాణ పార్టీ బీజేపీలో కలిసిపోయిందని తెలిపారు.