– ఆర్నెళ్ల నుంచి లోకేష్ పాదయాత్రకు స్కెచ్
– పర్మిషన్ పెండింగ్ లో పెట్టిన పోలీసులు
– పాదయాత్రను అడ్డుకోవడానికే జీవో నెం.1 అంటున్న టీడీపీ
– జగన్ పాదయాత్ర నాటి వీడియోలు వైరల్
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ..కీలక నేతల పాదయాత్రలతో రోడ్డెక్కడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టుబోతున్నారు. పార్టీని బలోపేతం చేయడానికి యువగళం పేరుతో లోకేష్ చేత పాదయాత్ర చేయించాలని టీడీపీ ఆరునెలలుగా కసరత్తు చేసింది. దీని కోసం మొత్తం టీడీపీ శ్రేణులంతా యాక్టివ్ అయ్యారు.
రూట్ మ్యాప్ సహా..వైఎస్ఆర్సీపి ప్రభుత్వం నుంచి ఎలాంటి అడ్డంకులు రావొచ్చు.. వాటిని ఎలా ఎదర్కోవాలన్నదానిపై ముందస్తుగా కసరత్తు పూర్తి చేశారు. అయితే అంతా లో ప్రొఫైల్ లోనే పూర్తి చేశారు. ప్రచారం మాత్రం వైసీపీ చేస్తుందని వాళ్లు ప్లాన్ చేసుకున్నారమే కాని అనుకున్నట్లుగానే చేస్తున్నారు. లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారని..ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు,ఇతర సంఘ విద్రోహ శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని..భద్రత కల్పించాలని రెండు వారాల కిందటే ఏపీ పోలీసులకు టీడీపీ నుంచి లేఖ వెళ్లింది. కానీ పోలీసులు స్పందించలేదు.
రెండోసారి టీడీపీ రిమైండర్ పంపిన తర్వాత పోలీసుల నుంచి స్పందన వచ్చింది. పాదయాత్రకు సంబంధించిన డీటైల్స్…ఎన్నిరోజులు నిర్వహిస్తారు..ఏ రోజు ఎక్కడ పాదయాత్ర చేస్తారు..ఎంత మంది పాల్గొంటారు అన్న వివరాలు ఇవ్వాలని కోరారు. దీనిపై టీడీపీ మళ్లీ సమాధానం పంపింది. అయితే అనుమతి ఇస్తారా లేదా అన్నదానిపై స్పష్టత లేదు. పాదయాత్రను అడ్డుకోవడానికే ఇలా చేస్తున్నారని టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి.
ఇటీవల వైసీపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ వన్ లోకేష్ పాదయాత్ర జరగకుండా టార్గెట్ చేసి రిలీజ్ చేసిందేనని..టీడీపీ వర్గాలంటున్నాయి. టీడీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణను వైసీపి భరించలేకపోతుందని..అందుకే కట్టడి చేయాలనుకుంటుందని అంటున్నారు. మరో వైపు కుప్పంలో లోకేష్ పాదయాత్ర రోజున ఆయనను అడ్డుకుందామని..దాడులు చేద్దామని.. వైఎస్ఆర్సీపీ తరపున కొంత మంది నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
కుప్పం నియోజక వర్గం శాంతిపురం మండలం ఎంపీపీ కోదండరెడ్డి ఇచ్చిన ఈ పిలుపు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లోకేష్ పాదయాత్రకు వైసీపీ ద్వారా కానీ, ప్రభుత్వం ద్వారా కానీ ప్రస్తుతం ప్రచారం విస్తృతంగా లభిస్తోంది. ఈ పాదయాత్రకు ఆటంకాలు ఏర్పడితే ప్రభుత్వానికి.. చేతకాని పాలనగా బ్రాండ్ పడిపోతుంది. జగన్ సుదీర్ఘ కాలం పాదయాత్ర, ఓదార్పు యాత్రలు చేసే అధికారంలోని వచ్చారు. ఆయన ఎప్పుడూ అనుమతులు తీసుకోలేదు. అనుమతుల అవసరం లేదని వైసీపీ నేతలు చేసిన ప్రకటనలు కూడా ఇప్పుడు సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి.