ఓ సినిమాకు ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంగీత దర్శకులు పనిచేయడం కొత్తేంకాదు. బాలీవుడ్ లో ఇప్పుడిదో ట్రెండ్. తెలుగులో కూడా సాహో, రాధేశ్యామ్ లాంటి సినిమాల విషయంలో ఇదే జరిగింది. ఇదే విధంగా నాగచైతన్య సినిమాకు కూడా ఇద్దరు సంగీత దర్శకులు కలిసి పనిచేయబోతున్నారు. అయితే.. ఇది చాలా ప్రత్యేకమైన కలయిక.
వెంకట్ ప్రభు దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు నాగచైతన్య. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజాను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. అయితే అతడితో పాటు ఇళయరాజాను కూడా సంగీత దర్శకుడిగా అనౌన్స్ చేశారు. తండ్రికుమారులు కలిసి పనిచేస్తున్న తొలి సినిమాగా నాగచైతన్య ప్రాజెక్టు రికార్డ్ సృష్టించింది.
చైతూ-వెంకట్ ప్రభు సినిమాలో ఇళయరాజా ఓ పాట పాడబోతున్నారు. మరో 2 పాటలకు ట్యూన్స్ కూడా అందించబోతున్నారు. అలా నాగచైతన్య సినిమాకు సెట్స్ పైకి వెళ్లకముందే ఓ ప్రత్యేకత ఏర్పడింది.
ఇంతకీ ఈ కాంబినేషన్ ఎందుకు సెట్ అయిందో తెలుసా? వెంకట్ ప్రభు ప్రతి సినిమాకు యువన్ శంకర్ రాజానే సంగీతం అందిస్తాడు. వాళ్లిద్దరు కేవలం స్నేహితులు మాత్రమే కాదు, బంధువులు కూడా. అందుకే నాగచైతన్య సినిమా కోసం యువన్ తో పాటు ఇళయరాజాను ఒప్పించడం వెంకట్ ప్రభుకు పెద్ద ఇబ్బంది కాలేదు.