ఐసీసీ టోర్నీల్లో భారత్ వైఫల్యాలపై టీమ్‌ఇండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. మిడిలార్డర్ లో సరైన బ్యాటర్ లేకపోవడంతో పాటు.. మంచి ప్రణాళిక ఉండకపోవడం కారణంగానే ఐసీసీ టోర్నీల్లో టీమ్‌ఇండియా ఫెయిల్ అయిందని అభిప్రాయపడ్డారు.
2011లో ప్రపంచకప్ గెలిచినప్పుడు నిర్దిష్టమైన స్థానాలకు బ్యాటర్లు ఉన్నారని.. కానీ 2019 ప్రపంచకప్ కు సరైన ప్రణాళిక లేదని వ్యాఖ్యానించారు. కేవలం 5-7 వన్డేల అనుభవమున్న విజయ్ శంకర్ ను నాలుగో స్థానం కోసం ఎంపిక చేశారని.. 4 వన్డేలాడిన రిషబ్ పంత్ ను అతని బదులు నాలుగో స్థానంలో ఆడించారని యువరాజ్ వివరించారు.
కానీ.. ఆ సమయంలో ఫామ్‌లో ఉన్న అంబటి రాయుడుకు జట్టులో అవకాశం ఇస్తే అతని అనుభవం కలిసిసొచ్చేదని అభిప్రాయపడ్డారు యువరాజ్. 2003 ప్రపంచకప్ ఆడే సమయానికి మహ్మద్ కైఫ్, దినేశ్ మోంగియాలతో పాటు.. తనకు 50 వన్డేలాడిన అనుభవం ఉందని గుర్తుచేశారు.
టీ20 క్రికెట్లోనూ మిడిలార్డర్ సమస్య లేకపోలేదని.. టీమ్‌ఇండియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ ఫ్రాంఛైజీ క్రికెట్లో టాప్ ఆర్డర్ లో ఆడుతారన్నారు. ప్రపంచకప్ కు సిద్ధమయ్యే ఆటగాళ్లు నిర్దిష్టమైన స్థానాల్లో ఆడటం ఎంతో ముఖ్యమని చెప్పారు. గత టీ20 ప్రపంచకప్ లో కూడా టీమ్‌ఇండియాను వెంటాడిన ప్రధాన లోపం అదేనని అన్నారు యువరాజ్.