మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ భారత క్రికెట్ చరిత్రలో ప్రత్యేకమైన ఆటగాడు. టీమిండియా సాధించిన రెండు మేజర్ వరల్డ్‌కప్స్(2007 టీ20, 2011 వన్డే) జట్టులో యువీ కీలక ఆటగాడి ఉన్నాడు. దీంతోపాటు మరెన్నో ఘనతలు సాధించాడు. కానీ యువరాజ్ తన క్రికెట్ ప్రస్థానంలో టీమిండియాకు పూర్తిస్థాయి కెప్టెన్‌గా పనిచేయలేదు. తాజాగా కెప్టెన్‌గా అవకాశం రాకపోవడంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
తాను 2007లోనే కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాల్సి ఉందని, కొన్ని పరిస్థితుల కారణంగా సాధ్యం కాలేకపోయిందన్నారు. అసలైతే, ధోని కంటే ముందు కెప్టెన్‌గా తన పేరే పరిగణనలోకి వచ్చిందని, కానీ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులోని పలువురు కుట్ర పన్ని దానిని తనకు దక్కకుండా చేశారని చెప్పుకొచ్చాడు. మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో యువరాజ్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేశాడు యూవీ.
‘వాస్తవానికి 2007లో నేనే కెప్టెన్ అవ్వాల్సి ఉండే. అదే సమయంలో గ్రేగ్ ఛాపెల్ వివాదం చోటుచేసుకుంది. అప్పుడు సచిన్, ఛాపెల్‌ల మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. దీంతో నేను సచిన్‌కి మద్దతుగా నిలిచా. అది కొంతమంది బీసీసీఐ పెద్దలకు నచ్చలేదు. దీంతో నన్ను తప్ప ఎవరినైనా కెప్టెన్ చేయాలని వారు నిర్ణయించుకున్నట్లు నాకు తెలిసింది. అయితే, అదెంతవరకు నిజమో నాకు తెలియదు.
అప్పటికి వైస్ కెప్టెన్‌గా ఉన్న నన్ను ఉన్నట్టుండి తొలగించారు. 2007 ప్రపంచకప్ టోర్నీకి ముందు మేం ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాం. అప్పుడు సెహ్వాగ్ జట్టులో లేడు. నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నా. ద్రవిడ్ కెప్టెన్‌గా ఉన్నాడు. దీంతో నేనే కెప్టెన్ అవ్వాల్సింది. కానీ, అనూహ్యంగా నన్ను కాదని ధోనీని ఎంపిక చేశారు. అది నాకు పూర్తిగా వ్యతిరేకమైన నిర్ణయం. దాని గురించి నేనేమీ చింతించట్లేదు. ఆరోజు జరిగిన ఘటనే ఇప్పుడూ జరిగినా జట్టు సభ్యుడివైపే నేను నిలబడతానుస’ అని యువీ చెప్పుకొచ్చాడు.
ఇక, యువరాజ్ తన 17 ఏళ్ల కెరీర్‌లో 40 టెస్టుల్లో 1900 పరుగులు, 304 వన్డేల్లో 8,701 పరుగులు, 58 టీ20ల్లో 1177 పరుగులు సాధించాడు. వన్డేల్లో 14 సెంచరీలు అందుకున్న యువరాజ్ టెస్టుల్లో మూడు సెంచరీలు సాధించాడు. ఇక ఐపీఎల్ టోర్నీలో 132 మ్యాచులు ఆడి 2750 రన్స్ కొట్టారు. ఎక్కువగా పంజాబ్ కింగ్స్ జట్టుకు ఆడారు. 2019 జూన్ 10న యువరాజ్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
2005 నుండి 2007వరకు చాపెల్ భారతదేశ ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. అతని పదవీకాలం వివాదాలతో కొనసాగింది. ఆస్ట్రేలియన్ మాజీ కెప్టెన్ సచిన్ టెండూల్కర్‌తో సహా పలువురు సీనియర్ ఆటగాళ్లతో ఆయన విభేదాలు పెంచుకున్నాడు. ఈ క్రమంలో యువరాజ్ సింగ్.. ఈ వివాదాల్లో సచిన్‌కు మద్దతుగా నిలబడ్డాడు. దీంతోనే.. యువీకి కెప్టెన్సీ దక్కలేదన్న వార్తలు అప్పట్లో హల్చల్ చేశాయి.