జహీరాబాద్‌లోని ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యంపై చెరుకు రైతులు తిరగబడ్డారు. చెరుకును కొనుగోలు చేసి, డబ్బులను సకాలంలో చెల్లించకుండా ఇబ్బందులు పెట్టడంపై కన్నెర్ర చేశారు. ఆలస్యంగా డబ్బులను ఇవ్వడంతో.. చేసిన అప్పులకు వడ్డీ కట్టడానికే అవి సరిపోతున్నాయంటూ నిరసనకు దిగారు. చెరుకు రైతులంతా కలిసి జహీరాబాద్ బంద్‌కు పిలుపునివ్వగా.. వేలాది రైతులు కదలివచ్చారు.
చెరుకు రైతుల సమస్యలపై ఎన్ని నిరసనలు చేసినా ఫలితం లేకుండాపోయిందని రైతులు వాపోయారు. ప్రైవేట్ సంస్థ కాబట్టి స్థానిక నాయకులు కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గత సంవత్సరం ఏకంగా ఫ్యాక్టరీనే నడిపించలేక పోయారని, దీంతో చెరుకు ఇతర రాష్ట్రాలకు తరలించటానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఏడాది కూడా సుమారుగా 25వేల ఎకరాల్లో చెరుకు పంట వేశారని, సుమారుగా 8లక్షల టన్నులు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కానీ యాజమాన్యం ఫ్యాక్టరీని పునః ప్రారంభించటానికి ఇంకా ఎలాంటి చర్యలు చేయకపోవడంపై మండిపడ్డారు.
తమ సమస్యపై మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, నిరంజన్ రెడ్డితో పాటు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని, ప్రతి రైతు వాట్సాప్‌లో మెస్సేజ్‌లు పంపించాడని కానీ.. ఎవరూ స్పందించలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసారు. ఇప్పటికే సెప్టెంబర్ 3న దాదాపు 5వేలమంది రైతులు భారీ ర్యాలీ నిర్వహించి, ఆర్డీవోకి వినతిపత్రం అందజేశారు. బుధవారం బంద్ నిర్వహించారు. కర్మాగారాన్ని ప్రభుత్వమే నడిపించాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలి రైతులు డిమాండ్ చేశారు. 4 రోజుల్లో స్పందించకపోతే జహీరాబాద్ హైవే రోడ్ దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కూడా పోటీ చేస్తామని ప్రకటించారు.